Begin typing your search above and press return to search.

గ్రేట్ హైదరాబాదీస్.. డెలివరీ కుర్రాడికి ఊహించని బహుమతి ఇచ్చారు

By:  Tupaki Desk   |   19 Jun 2021 3:30 PM GMT
గ్రేట్ హైదరాబాదీస్.. డెలివరీ కుర్రాడికి ఊహించని బహుమతి ఇచ్చారు
X
అంత దారుణం జరిగింది.. ఇంత అన్యాయం చోటు చేసుకుంది. నిద్ర లేచింది మొదలు నెగిటివ్ వార్తలు.. విశేషాలు చూసే వారంతా తెలీకుండానే.. అదేంటి మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇంతలా చెడిపోయిందన్న భావన కలగటం ఖాయం. కానీ.. మన చుట్టు ఉన్న వారు కూడా మనలాంటి వారే. అంటే.. మంచివాళ్లే. ఎక్కడో కొద్దిమంది తప్పించి.. మిగిలిన వారంతా స్పందించే మనసున్న వారే. కాకుంటే.. ఆ విషయం కొన్ని సందర్భాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని ఈ రియల్ స్టోరీ లోకి వెళితే..

వారం క్రితం లక్డీకాఫూల్ కు చెందిన వ్యక్తి జొమాటోలో ఆర్డర్ చేశారు. కింగ్ కోఠి నుంచి కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే డెలివరీకి వచ్చేశాడు. కరోనా నేపథ్యంలో డెలివరీ తీసుకోవటం కోసం ఆర్డర్ చేసిన వ్యక్తి బయటకు వచ్చాడు. డెలివరీ కుర్రాడ్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే.. ఫుడ్ డెలివరీ చేసే వారు సాధారణంగా బైక్ వినియోగిస్తారు. అందుకు భిన్నంగా డెలివరీ కుర్రాడు సైకిల్ మీద రావటంతో ఆశ్చర్యపోయాడు.

అదేంటి? బైక్ లేదా? అని అడిగాడు ఆర్డర్ బుక్ చేసిన రాబిన్ ముకేశ్. లేదని.. చెప్పాడు 21 ఏళ్ల డెలివరీ బాయ్ అకీల్. విన్నంతనే అయ్యో అనిపించిన రాబిన్.. ఆ డెలివరీ బాయ్ వివరాల్ని తెలుసుకున్నాడు. అగాడిది పాతబస్తీలోని తలాబ్ కట్టలోని నిరుపేద కుటుంబమని.. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ.. ఇంటికి ఆర్థికంగా దన్నుగా నిలవటానికి డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అతడి తండ్రి చిన్నపనులు చేస్తుంటాడు. సాధారణంగా డెలివరీ బాయ్ కు బైక్ తప్పనిసరి. కానీ.. జొమాటో ప్రతినిధుల్ని కలిసి.. తన పరిస్థితి చెప్పి.. సైకిల్ మీద డెలివరీలో ఎలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకుంటానని హామీ ఇవ్వటంతో వారు ఉద్యోగం ఇచ్చారు.

అలా మొదలైన అతడి డెలివరీ జాబ్ సైకిల్ మీదనే 14 నెలలుగా పని చేస్తున్నాడు.అతడి గురించి విన్న రాబిన్ చలించిపోయాడు. అతడి వివరాల్ని తీసుకున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఇంటికి అండగా ఉండాలన్న అఖీల్ తపనకు ఫిదా అయ్యాడు. నీకెలాంటి సాయం కావాలని కోరితే.. ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ ఉంటే మరింత సంపాదించే వీలుందని చెప్పాడు.

ఇప్పుడెంత సంపాదిస్తున్నావనిఅడిగితే రోజుకు రూ.500-600 సంపాదిస్తున్నాని. అదే బైక్ అయితే రోజుకు రూ.వెయ్యి వరకు సంపాదించే వీలుందని చెప్పాడు. తనకు ఎదురైన అనుభవనాన్ని రాబిన్.. 32 వేల మంది సభ్యులు ఉన్న ది గ్రేట్ హైదరాబాద్ ఫుడ్ అండ్ ట్రావెల్ గ్రూపులో పోస్టు చేశాడు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో.. టీవీఎస్ షో రూంకు వెళ్లి.. అక్కడ ఒక మోపెడ్ చూసి.. దాని కొటేషన్ ను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.

టీవీఎస్ ఎక్స్ ఎల్ కొనాలంటే రూ.65,800 అవుతుందని పేర్కొన్నాడు. అనూహ్యంగా తర్వాతి రోజుకు రూ.73వేలు పంపారు. వెంటనే.. తనకు వచ్చిన విరాళాల వివరాల్ని వెల్లడించిన రాబిన్.. ఎవరూ డబ్బులు పంపొద్దని చెబుతూ.. కొత్త బండిని తీసుకోవటమేకాదు.. మిగిలిన మొత్తాన్ని అతడి కాలేజీ ఫీజు కింద కట్టేశాడు. డెలివరీ కుర్రాడ్ని పిలిచి.. కొత్త వాహనాన్ని అందించాడు. ఇదంతా చదివినప్పుడు స్పందించే లక్షణం మన చుట్టు ఉన్న ఎందరికో ఉందన్న విషయం అర్థమవుతుంది. ఒక హైదరాబాదీగా ఇంతకు మించిన హ్యాపీ న్యూస్ ఏముంటుంది చెప్పండి?