Begin typing your search above and press return to search.

హైదరాబాద్ టు ఢిల్లీ ... ఒకే ఒక గంట !

By:  Tupaki Desk   |   22 Nov 2020 3:50 PM GMT
హైదరాబాద్ టు ఢిల్లీ ... ఒకే ఒక గంట !
X
హైపర్‌ లూప్ ... హైపర్‌ లూప్ అనేది అభివృద్ధి చెందుతున్న ఒక కొత్త రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్ లో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సంభవించనున్నాయి.ప్రముఖ శాస్త్రవేత్త, టెస్లా సంస్థ అధ్యక్షుడు ఎలన్ మస్క్ ఈ వ్యవస్థకు సూత్రధారి. ఈ వ్యవస్థను ఉపయోగించి గంటకు కనీసం 965 కిలోమీటర్లు వేగంతో దూసుకెళ్లవచ్చు. అంటే... హైదరాబాద్ నుంచి ఢిల్లీకి గంటకే చేరుకోవచ్చు. 2013 ఆగస్టులో ఎలన్ మస్క్ హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ గురించి తొలిసారి ప్రకటన చేసినప్పుడు... చాలామంది ఆ ఆలోచనను ఎద్దేవా చేశారు. కానీ... ఈ ప్రాజెక్టు వివరాలు ప్రపంచానికి తెలియడం మొదలైనప్పటి నుంచి విమర్శకులు కూడా దీనిని అంగీకరించే పరిస్థితి వచ్చింది. వాహనమేదైనా ముందుకు కదలాలంటే చాలా గురుత్వాకర్షణ శక్తితోపాటు, గాలివేగం, పీడనం వంటి అనేక రకాల శక్తులను అధిగమించాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిమితులేవీ లేని అంతరిక్షంలో అతితక్కువ ఇంధనంతోనే ఉపగ్రహాలు అతివేగంతో వెళతాయి. హైపర్‌లూప్ టెక్నాలజీ కూడా ఇలాంటిదే. కాకపోతే అంతరిక్షంలోని పరిస్థితులను కొద్దిగా మార్చి ఉపయోగిస్తారు.

హైపర్‌ లూప్ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది ఖర్చు గురించి. మస్క్ తన ప్రాజెక్టును శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిలెస్ మధ్య ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. దాదాపు 558 కిలోమీటర్ల దూరమున్న ఈ మార్గంలో హైపర్‌లూప్ ట్రాన్స్‌ పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 700 కోట్ల డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా కానీ దాదాపుగా ఇంతే పొడవున్న హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వం దాదాపు పది రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నది. ఒక్క ప్రయోగశాలల్లో తప్ప సాధారణంగా భూతలంపైన ఏ వస్తువూ గంటకి ఏడొందల కిలోమీటర్ల వేగంతో వెళ్లలేదు. వేగంగా వెళ్లే వస్తువుకి ఎదురయ్యే గాలి దాన్ని అడుగడుగునా అడ్డుకుంటూ ఉండటమే ఇందుకు కారణం. అందుకే ఆకాశంలో గంటకి 1300 కి.మీ వేగంతో వెళ్లే విమానాలు కూడా నేలపైన తక్కువ స్పీడుతోనే వెళతాయి. ఆకాశంలో పైపైకి వెళ్లేకొద్దీ గాలిశాతం తగ్గి శూన్య వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ స్పీడు అందుకుంటాయి

శూన్య వాతావరణాన్ని భూమిమీదా కల్పించి నేలపైనే విమానమంత వేగంతో వెళితే... ఎలా ఉంటుంది! ‘హైపర్‌లూప్‌’కి ఆ ఆలోచనే మూలం. అందుకే ఓ పెద్ద సైజు పైపులో శూన్య వాతావరణాన్ని కల్పించి అందులో ఓ చిన్న వ్యానులాంటి వాహనాన్ని పంపిస్తారు. దాంతో గాలి తక్కువగా ఉండటం వల్ల ఈ వాహనం పైపులో కనీవినీ ఎరగనంత వేగాన్ని అందుకుంటుంది. అంతేకాదు... ఈ పాడ్‌కి చక్రాల్లాంటివేవీ ఉండవు. చక్రాలతో ఏర్పడే రాపిడి కూడా వేగాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఈ పాడ్‌ ప్రయాణానికి మ్యాగ్‌ లెవ్‌ అనే సాంకేతికత వాడతారు. సాధారణంగా అయస్కాంతాలని ఉపయోగించి కొన్ని వస్తువుల్ని మనం గాలిలో తేలేలా చేస్తుంటాం కదా. అదే టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ పాడ్‌ ని తేలుతూ దూసుకెళ్లేలా చేస్తారు. ఆ రకంగా గంటకి 1300 కి.మీ వేగాన్ని సాధ్యం చేస్తారు. కేవలం అయస్కాంత క్షేత్రాల్లోని మార్పుల ద్వారా ప్రయాణించడం వల్ల దీనికి కరెంటు పెద్దగా అక్కర్లేదు. ఆ రకంగా ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న రైలు, విమానాలకంటే హైపర్‌ లూప్‌ అతితక్కువ ఇంధనాన్నే ఉపయోగించుకుంటుంది.