హైదరాబాద్ లో దారుణం: ప్రేమపెళ్లి చేసుకున్నాడని నడిరోడ్డు మీద నరికేశారు

Sat May 21 2022 10:20:17 GMT+0530 (IST)

Hyderabad shocking murder case

విశ్వనగరం రేసులో దూసుకెళుతున్న హైదరాబాద్ మహానగరంలో దారుణాలు ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్నాయి. పదిహేను రోజుల వ్యవధిలో ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కోపంతో అమ్మాయి తరఫు వారు పెళ్లి చేసుకున్న వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేస్తున్న వైనాలు చోటు చేసుకుంటున్నాయి. నాగరాజు హత్యోదంతాన్ని మర్చిపోకముందే.. తాజాగా అత్యంత రద్దీగా ఉండే బేగంబజార్ లో దారుణం హత్య చేసిన ఉదంతం సంచలనంగా మారింది. తమ కులంకాని అమ్మాయిని పెద్దలు కాదన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవటమే అతగాడి తప్పైంది.ఇందుకు ప్రాణాన్ని బలి ఇవ్వాల్సి వచ్చింది. అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే.. మర్వాడీ అయిన మహేందర్ పర్వాన్ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బేగంబజార్ లోని కొల్సావాడి ప్రాంతంలో స్థిరపడ్డారు. వారు పల్లీల వ్యాపారం చేస్తుంటారు. మహేందర్ కొడుకు పాతికేళ్ల నీరజ్ తండ్రి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటాడు. తమ ప్రాంతంలో ఉండే సంజనతో అతడికి పరిచయమైంది.

అది కాస్తా ప్రేమగా మారింది. సంజన విషయానికి వస్తే.. వారు సైతం ఉత్తర భారతానికి చెందిన వారు. కాకుంటే యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. తమ కుమార్తెను మార్వాడీ వర్గానికి చెందిన అబ్బాయి ప్రేమించిన విషయం తెలిసి మందలించారు. తమ కుమార్తె జోలికి రావొద్దని వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా గత ఏడాది ఏప్రిల్ లో సంజన.. నీరజ్ లు ఇద్దరు పారిపోయి ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకొని.. రెండు నెలల పాటు ఎవరికి అందుబాటులో రాకుండా ఉన్నారు. అనంతరం సంజన గర్భవతి కావటంతో తిరిగి కాలనీకి వచ్చాడు. తమ కుమార్తెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడన్న ఆగ్రహంతో కక్ష పెంచుకున్న ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇరువురు మేజర్లు కావటంతో ఇరు వర్గాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. తాజాగా నీరజ్ పై పగ తీర్చుకోవాలని భావించిన సంజన కుటుంబ సభ్యులు ఒక బ్యాచ్ ను తయారు చేసి.. శుక్రవారం రాత్రి దారుణ హత్యకు పాల్పడ్డారు.

రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బయట నుంచి తన ఇంటికి వస్తున్న వేళ.. ఇంటి వద్దకు వచ్చే సమయంలో అతడు డ్రైవ్ చేస్తున్న స్కూటీ ని వేరే వాహనంతో ఢీ కొట్టారు. ఆ వెంటనే బైకులు దిగిన దుండగులు.. కత్తులతోనీరజ్ పై దాడి చేశారు. 20 సార్లు విచక్షణరహితంగా పొడిచి చంపేశారు. చనిపోయాడో లేడో అన్న సందేహంతో.. పక్కనే ఉన్న గ్రానైట్ రాయిని నీరజ్ మీద ఎత్తేసి.. చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత బైకుల మీద పారిపోయారు. నడిరోడ్డు మీద నీరజ్ ను కత్తులతో పొడుస్తున్నా.. దారుణంగా చంపేస్తున్నా.. చుట్టు ఉన్న వారు వందల్లో ఉన్నా చూస్తూ ఉండిపోయారే తప్పించి.. ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవటం గమనార్హం.

హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు రెండు టీంలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. హత్యకు వినియోగించిన బైకులు.. కత్తులు.. రాడ్లతో సహా నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. నీరజ్ హత్యకు నిరసనగా వందలాది మర్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు వ్యాపారులు బంద్ కు పిలుపునిచ్చారు. ఈ ఉదంతం హైదరాబాద్ మహానగరంలో సంచలనంగా మారింది.