Begin typing your search above and press return to search.

ఈఓఎల్ ఇండెక్స్‌లో హైద‌రాబాద్‌కు 24వ స్థానం: పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు!

By:  Tupaki Desk   |   7 March 2021 4:13 AM GMT
ఈఓఎల్ ఇండెక్స్‌లో హైద‌రాబాద్‌కు 24వ స్థానం:  పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు!
X
దేశంలో `సుల‌భ త‌ర నివాస‌యోగ్య న‌గ‌రాల‌`(ఈఓఎల్‌) జాబితాను ఇటీవ‌ల కేంద్ర ప‌ట్టణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి విడుద‌ల చేశారు. ఈ జాబితాలో హైద‌రాబాద్ 24వ ర్యాంకును సాధించింది. గ‌తంలో 4వ ర్యాంకులో ఉన్న హైద‌రాబాద‌.. ఇప్పుడు 24కు చేరింది. ఈ ప‌రిణామం.. అధికార టీఆర్ ఎస్‌ను తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టింది. దీంతో బీజేపీ నేత‌ల‌పై టీఆర్ ఎస్ నాయ‌కులు విరుచుకుప‌డ్డారు. బీజేపీ నాయ‌కుల వ్య‌ర్థ వాద‌న‌లు, వ్యాఖ్య‌ల కార‌ణంగానే హైద‌రాబాద్ ఇమేజ్‌కు డ్యామేజ్ ఏర్ప‌డుతోంద‌ని టీఆర్ ఎస్ నాయ‌కులు విమ‌ర్శించారు.

వాస్త‌వానికి ఈఓఎల్ జాబితా రెండు ర‌కాలుగా ఉంటుంది. ఒక‌టి.. ప‌ది ల‌క్ష‌ల జ‌నాభా పైబ‌డి నివ‌శిస్తున్న న‌గ‌రాలు, అదేస‌మ‌యంలో ప‌ది ల‌క్ష‌ల క‌న్నా త‌క్కువ మంది నివ‌శిస్తున్న జ‌నాభాతో కూడిన జాబితాలు ఉంటాయి. ప‌దిల‌క్ష‌ల క‌న్నా ఎక్కువ మంది నివ‌శిస్తున్న న‌గ‌రాల జాబితాలో బెంగ‌ళూరు తొలిస్థానంలో ఉంది. ఇదే ఇప్పుడు దేశంలో అత్యంత నివాస యోగ్య న‌గ‌రంగా జాబితాలో చోటు సంపాయించుకుంది. త‌ర్వాత స్థానంలో మ‌హారాష్ట్రలోని పుణే ఉంది. ఇక‌, గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ మూడో స్తానంలో నిలిచింది. ఇలా మొత్తం 111 న‌గ‌రాలు ఈ జాబితాలో చోటు ద‌క్కించుకున్నాయి. వీటిలో హైద‌రాబాద్ 24వ స్థానంలో నిలిచింది. విశాఖ ప‌ట్నం 15వ ర్యాంకును ద‌క్కించుకుంది. ఇక‌, ప‌ది ల‌క్ష‌ల క‌న్నా.. త‌క్కువ ఉన్న జనాభా జాబితాలో సిమ్లా తొలిస్థానం సంపాయించుకోగా.. కాకినాడ నాలుగో స్తానంలో నిలిచింది.

టీఆర్ ఎస్ విమ‌ర్శ‌లు..

సుల‌భ‌త‌ర నివాస యోగ్య జాబితాలో హైద‌రాబాద్‌కు 24వ ర్యాంకు రావ‌డంపై అదికార పార్టీ టీఆర్ ఎస్ నేత‌లు.. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీజేపీ నేత‌ల వ్య‌వ‌హార శైలి కార‌ణంగానే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని నిప్పులు చెరిగారు. మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ గద్వాల విజ‌య‌ల‌క్ష్మి మ‌రింతగా ఫైర‌మ‌య్యారు. హైద‌రాబాద్‌కు ర్యాంకు త‌గ్గిపో్వ‌డం వెనుక బీజేపీ నేత‌ల పాత్ర ఉంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. `ఒకే సారి 4వ ర్యాంకు నుంచి 24వ ర్యాంకుకు ఎలా ప‌డిపోతుంది?` అని ఆమె ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అయితే.. ఈ జాబితాలో హైద‌రాబాద్ ఎందుకు వెనుక‌బ‌డింతో స‌వివ‌రంగా వివ‌రించారు. డ్రైనేజీ వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా ఉండ‌డమే కార‌ణ‌మ‌ని ప్ర‌ధానంగా పేర్కొన్నారు. అయితే.. ఇదే స‌మ‌స్య ఉన్న చెన్నై న‌గ‌రం ఈ జాబితాలో 4వ స్థానం ఎలా సంపాయించుకుంద‌నేది టీఆర్ ఎస్ నేత‌ల ప్ర‌శ్న‌.

బీజేపీ నేత‌ల ఎదురు దాడి!

మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, టీఆర్ ఎస్ నేత‌లు చేసిన విమ‌ర్శ‌ల‌కు బీజేపీ నేత‌లు అంతే స్తాయిలో కౌంట‌ర్ ఇచ్చారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అనుస‌రించిన నిర్ల‌క్ష్య ధోర‌ణే హైద‌రాబాద్‌కు శాపంగా మారింద‌ని నిప్పులు చెరిగారు. గ‌తంలో హైద‌రాబాద్ డ్రైనేజీ వ్య‌వ‌స్థ బాగోలేద‌ని, ఇక్క‌డ వ‌ర‌ద‌లు వ‌స్తే.. నిండా మున‌గాల్సిందేన‌ని.. ఇదే మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి చేసిన వ్యాఖ్య‌ల‌ను బీజేపీ నేత‌లు వైర‌ల్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇదే విష‌యంపై విజ‌య‌ల‌క్ష్మిని కొంద‌రు ప్ర‌శ్నించిన‌ప్పుడు.. `హైద‌రాబాద్ ను .. వ‌ర‌ద‌ల నుంచి ఆదేవుడే కాపాడాలి` అని స‌మాధానం ఇచ్చిన విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చి మ‌రీ ఎదురుదాడి చేస్తున్నారు. అంతేకాదు.. హైద‌రాబాద్ ప్ర‌జ‌లు..టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై ఎంత‌గా విసిగిపోయారో.. తాజాగా జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌లే నిద‌ర్శ‌న‌మ‌ని కూడా బీజేపీ నాయ‌కులు వ్యాఖ్య‌లు సంధించారు. ఆ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అడుగ‌డుగునా ప్ర‌జ‌లు డ్రైనేజీ స‌మ‌స్య‌పైనే టీఆర్ ఎస్ నేత‌ల‌ను నిల‌దీసిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

ఇరు ప‌క్షాల వాద‌న‌లోనూ ప‌స!

హైద‌రాబాద్‌కు ర్యాంకు త‌గ్గిపోవ‌డంపై ఇరు ప‌క్షాల వాద‌న‌లోనూ ప‌స ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2018లో బెంగ‌ళూరు ఇదే జాబితాలో 58వ స్థానంలో ఇప్పుడు ఏకంగా ఒక‌టో స్థానంలోకి ఎగ‌బాగింది. అయితే.. దీనిని బెంగ‌ళూరు ప్ర‌జ‌లే స్వాగ‌తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ఇక్క‌డి ట్రాఫిక్ స‌మ‌స్య‌లు, క‌నీస‌మౌలిక సౌక‌ర్యాలు వంటివి ఇప్ప‌టికి మృగ్య‌మే. ఈ నేప‌థ్యంలో ఈ జాబితా త‌యారీలో రాజ‌కీయ జోక్యం ఉంద‌నేది ప‌రిశీల‌కులవాద‌న‌. అంతేకాదు.. జాబితా త‌యారీలో స‌రైన విధివిధానాలు కూడా పాటించ‌లేద‌ని అంటున్నారు. 2018లో అనేక అంశాల‌ను ప‌రిశీల‌న‌లో తీసుకుని ర్యాంకులు కేటాయించారు. వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను సైతం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. ప్ర‌జ‌ల అవ‌గాహ‌న‌, అభిప్రాయాల‌కు విలువ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఇలాంటి వి ఏమీ లేకుండా ర్యాంకులు ప్ర‌క‌టించి ఉంటార‌ని అంటున్నారు.