మరో వివాదంలో హైదరాబాద్ మేయర్?

Sat Mar 06 2021 20:00:01 GMT+0530 (IST)

Hyderabad mayor in another controversy?

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈమె మేయర్ కాకముందే ఫైర్ బ్రాండ్ నేతగా పేరు ఉన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే కూతురు అయిన విజయలక్ష్మీని కేసీఆర్ ఏకంగా జీహెచ్ఎంసీ మేయర్ చేసేశారు.అయితే మేయర్ అయ్యాక విజయలక్ష్మీ అనూహ్యంగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. మేయర్ కాకముందే తాను పదవిలో ఉన్న ఐదేళ్లు వర్షాలు పడొద్దని మొక్కుకుంటున్నట్లు మీడియా ముందు ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఇటీవల కుక్కకు పూరీ తినిపిస్తూ అదే చేత్తో తానూ తింటూ ఉన్న వీడియోను పోస్టు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దీనిపై రాంగోపాల్ వర్మ ట్వీట్ చేసి రచ్చ చేశారు.

తాజాగా తనను జైల్లో పెట్టిస్తానని మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ బెదిరించిందని.. ఆమె నుంచి ప్రాణహాని ఉందని తాజాగా నగర టీఆర్ఎస్ నేత చెట్లపల్లి రాంచందర్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బంజారాహిల్స్ లో ఓ కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉండగా.. మధ్యలో మేయర్ జోక్యం చేసుకోవడం తనకు అంతుచిక్కడం లేదని అంటున్నారు.

మేయర్ విజయలక్ష్మీ నుంచి తనను రక్షించాలని.. తనకు న్యాయం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విజ్ఞప్తి చేసినట్లు రాంచందర్ తెలిపారు.మేయర్ విజయలక్ష్మీ ఆది నుంచి వివాదాలతో సహవాసం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తన తీరులో మార్పు రాకపోవడం గులాబీ శ్రేణులు పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది.