Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో మరోసారి కల్లోలం!

By:  Tupaki Desk   |   29 Nov 2022 4:39 AM GMT
హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో మరోసారి కల్లోలం!
X
మరోసారి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో కల్లోలం రేగింది. ప్రస్తుతం హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అజహర్‌కు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్‌ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అర్షద్‌ అయూబ్, జి.వినోద్‌లకు గత కొన్నేళ్లుగా సరిపడటం లేదు. ఒకరికొకరు ఆరోపణలు, విమర్శలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.

తాజాగా మరోమారు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్‌యాదవ్‌.. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అర్షద్‌ అయూబ్, జి.వినోద్‌... అజహరుద్దీన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. మహ్మద్‌ అజహరుద్దీన్‌ పాలనలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) పే అండ్‌ ప్లేగా మారిపోయిందని వారు ధ్వజమెత్తారు. అజహరుద్దీన్‌ ఆటగాళ్ల నుంచి ఒక్కో మ్యాచ్‌కు రూ.15 లక్షలు లంచం తీసుకుంటున్నాడని తీవ్ర విమర్శలు చేశారు.

సెప్టెంబరు 26తోనే అజహర్‌ పదవీకాలం ముగిసినా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం లేదని శివలాల్, అర్షద్, వినోద్‌.. హెచ్‌సీఏ మాజీ కార్యదర్శులు శేష్‌నారాయణ, జాన్‌ మనోజ్‌ మండిపడ్డారు.

నిబంధనల ప్రకారం ఏజీఎం నిర్వహించి.. ఎన్నికల తేదీని ప్రకటించాల్సి ఉందన్నారు. ఇలాంటి సందర్భంలో క్లబ్‌ల కార్యదర్శులు ప్రత్యేక ఏజీఎం నిర్వహించొచ్చని హెచ్‌సీఏ నియమావళి చెబుతుందన్నారు. డిసెంబరు 11న ఉప్పల్‌ స్టేడియంలో ప్రత్యేక ఏజీఎం నిర్వహించి ఎన్నికల తేదీ, రిటర్నింగ్‌ అధికారిని ప్రకటిస్తామని తెలిపారు. ఇదే విషయాన్ని పర్యవేక్షక కమిటీకి తెలియజేశామని వివరించారు.

అజహరుద్దీన్‌ బాధ్యతలు చేపట్టాక గత మూడేళ్లలో హెచ్‌సీఏ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని నిప్పలు చెరిగారు. అండర్‌–14, 16, 19, 22, సీనియర్‌ జట్లలో ఆటగాళ్ల ఎంపిక వ్యాపారమయమైందని తీవ్ర ఆరోపణలు చేశారు. వయోపరిమితి ధ్రువీకరణ పత్రం కోసం రూ.3 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని విమర్శించారు.

నిబంధనల ప్రకారం గరిష్టంగా 15 మందిని జట్టుకు ఎంపిక చేయాల్సి ఉండగా.. 30 మంది ఆటగాళ్లను టోర్నీలకు పంపిస్తున్నారని తప్పుబట్టారు. హెచ్‌సీఏలో అవకతవకల గురించి సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ కక్రూ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక నూటికి నూరు శాతం నిజమని శివలాల్‌ యాదవ్, అర్షద్‌ అయూబ్, వినోద్‌ తెలిపారు. అజహర్‌ అత్యంత అవినీతిపరుడని మండిపడ్డారు. జస్టిస్‌ కక్రూపై విరుద్ధ ప్రయోజనాలంటూ అజహర్‌ అనవసర ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా నిర్వహించే సమావేశాలకు వెళ్లొద్దంటూ క్లబ్‌ల కార్యదర్శులను అజహర్‌ బెదిరిస్తున్నాడని శివలాల్, అర్షద్, వినోద్‌ ఆరోపిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.