Begin typing your search above and press return to search.

హైదరాబాద్ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డు.. ఎక్కడి నుంచి ఎక్కడికి?

By:  Tupaki Desk   |   23 Feb 2021 11:10 AM GMT
హైదరాబాద్ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డు.. ఎక్కడి నుంచి ఎక్కడికి?
X
కేంద్ర బడ్జెట్ లో హైదరాబాద్ మెట్రోకు నిధులు కేటాయించలేదు. హైదరాబాద్ ప్రజలకు ఎన్నికల హామీని కూడా బీజేపీ నెరవేర్చలేదు. దీంతో అన్ని వైపులా విమర్శలు వస్తున్న వేళ సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎట్టకేలకు తెలంగాణకు మణిహారంగా రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డును కేంద్రం నుంచి మంజూరు చేయించారు. ప్రస్తుతమున్న ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్న దీనికి జాతీయ హోదాను కట్టబెట్టుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డు కథేంటి? దీనికి అయ్యే ఖర్చు ఎంత? ఎక్కడి నుంచి ఎక్కడికి దీన్ని ఏర్పాటు చేస్తున్నారన్నది ఆసక్తిగా మారింది.

ఈరోడ్డు పూర్తయితే హైదరాబాద్ పరిధి చాలా విస్తరిస్తుంది. కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తాయి. వివిధ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు పరిశ్రమలు, అభివృద్ధి విస్తరిస్తుంది.

హైదరాబాద్ కు ఆవల మొత్తం 338 కిలోమీటర్ల పొడువు నిర్మాణంతో ఈ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. తుఫ్రాన్, గజ్వేల్, జగదేవ్ పూర్, తుర్కపల్లి, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, నారాయణపూర్, యాచారం, షాద్ నగర్, పరిగి , పూడూరు, చేవెళ్ల, శంకర్ పల్లి మండలాల మీదుగా ఈ రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ వెల్లే అవకాశం ఉంది.

సోమవారం కిషన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర బీజేపీ నేతల బృందం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసింది. రీజినల్ రింగ్ రోడ్డుకు అన్ని అనుమతులు మంజూరు చేయాలని బృందం గడ్కరీని కోరింది. కేంద్రమంత్రి వెంటనే అంగీకరించడంతో హైదరాబాద్ నగరానికి మరో మణిహారం వచ్చినట్టైంది. మొదటి దశలో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 158 కి.మీల మేర నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. రూ.9522 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించారు.

ఇక రెండోదశలో చౌటుప్పల్-సంగారెడ్డి మధ్య 182 కి.మీల మేర నిర్మాణం చేపట్టనున్నారు. రెండు దశలకు కలిపి 17వేల కోట్లు హైదరాబాద్ కోసం కేంద్రం ఖర్చు చేయనుంది.. హైదరాబాద్ కు వచ్చే అన్ని హైవేలను ఇది కలుపుతుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ భూసేకరణ పనులను మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ప్రారంభించాలని కిషన్ రెడ్డి కోరారు. ఖరీదైన భూములను సేకరించడం అంత ఈజీ కాకపోవడంతో ఈ బాధ్యతను కేసీఆర్ సర్కార్ పై పెట్టారు. దీంతో అసలు భూసేకరణ కష్టమన్న ప్రచారం సాగుతోంది.

హైదరాబాద్ నగరానికి 50 నుంచి 70కి.మీల దూరంలో ఓఆర్ఆర్ కి 30కి.మీల దూరంలో ఈ రహదారి నిర్మాణం జరుగనుంది.సుమారు 20కిపైగా ముఖ్యనగరాలు, పట్టణాలను కలుపుతూ నిర్మాణం జరుగనున్న ఈ రహదారితో 40శాతం మంది ప్రజలకు రింగురోడ్డు ఉపయుక్తంగా ఉండనుంది.