షర్మిల కారు డ్రైవ్ చేసుకుంటూ హంగామా

Tue Nov 29 2022 15:04:09 GMT+0530 (India Standard Time)

Hyderabad Police Arrested YSSharmila in Car

వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల హైదరాబాద్ లో ఈ రోజు పొలిటికల్ హంగామా క్రియేట్ చేశారు. ఆమె ఏకంగా ప్రగతి భవన్ ని ముట్టడించడానికి లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి పోలీసుల కళ్ళు గప్పి స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ బయల్దేరారు. ఆమె పంజాగుట్ట సర్కిల్ దాటి ప్రగతి భవన్ వైపుగా సాగుతూంటే కారులో ఆమెను గుర్తించిన పోలీసులు అలెర్ట్ అయి ఆమె కారు ముందుకు పోనీయకుండా అడ్డుకున్నారు.ఎదురుగా కార్లను ఆటోలను పెట్టి ఆమె కారు కదలకుండా చేశారు. ఈ సందర్భంగా షర్మిలను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆమె కారు వద్దకు చేరుకోగా ఆమె లోపల డూర్ లాక్ చేసుకుని కూర్చుకున్నారు. పోలీసులతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. దాంతో చాలా సేపు అక్కడ ట్రాఫిక్ జాం అయింది. దాంతో పోలీసులు క్రేన్స్ సాయంలో షర్మిల ఉన్న కారుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు.

అలా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆమెను ఉంచి అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా షర్మిల పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతున్న నేపధ్యంలో లోకల్ టీయారెస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన హాట్ కామెంట్స్ కి నిరసనగా టీయారెస్ వర్గీయులు ఆమె ప్రచార వాహనాన్ని ద్వంసం చేశారు. అదే విధంగా షర్మిల కారు అద్దాలు కూడా బద్ధలు కొట్టారు.

దీనికి నిరసనగా ఏకంగా ప్రగతిభవన్ నే ముట్టడిస్తామని షర్మిల పిలుపు ఇచ్చారు. తమకు పాదయాత్ర చేసుకునే హక్కు ఉందని అన్ని అనుమతులూ ఉన్నాయని అయినా శాంతిభద్రతల సాకుతో అడ్డుకోవడమే కాకుండా తన వాహనాలను తగలబెట్టడం తమ బ్యానర్లను కూడా కాల్చడమేంటని ఆమె మండిపడుతున్నారు

ఈ విషయంలో అమీ తుమీ తేల్చుకుంటామంటూ ఆమె చెప్పడంతో లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటి వద్ద పోలీసులు కాపలా ఉంటూ ఆమెను హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల కళ్ళు గప్పిన షర్మిల తాను డైలీ వాడే కారు కాకుండా వేరే వాహనంలో కొంత దూరం చేరుకుని అక్కడ నుంచి ధ్వంసం అయిన తన కారులో ప్రగతిభవన్ వైపుగా బయల్దేరారు. అయైతే ఆమెను పంజాగుట్ట సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆమె మరోమారు అరెస్ట్ అయ్యారు.

ఇదిలా ఉండగా షర్మిల వ్యవహారం గత రెండు రోజులుగా తెలంగాణాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటిదాకా టీయారెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో కాంగ్రెస్ అన్నట్లుగా తెలనాణా పాలిటిక్స్ సాగుతోంది. షర్మిల పాదయత్ర పేరిట జిల్లాలను చుట్టుముడుతున్నారు కానీ అనుకున్న ఫోకస్ అయితే రావడంలేదు. దాంతో ఆమె లోకల్ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడుతున్నారు. కొన్ని చోట్ల ఆమె పార్టీ మీద టీయారెస్ శ్రేణులు రివర్స్ అటాక్ చేస్తున్నారు.

దీంతో ఆమెతో పాటు వైఎస్సార్టీపీ కూడా టాపిక్ అవుతోంది. ఇపుడు ఆమె ఒక రోజు వ్యవధిలో రెండు సార్లు అరెస్ట్ కావడంతో కొంత పొలిటికల్ హంగామా అయితే సృష్టించారు. కానీ ఈ హైప్ తో ఈ రకమైన పాలిటిక్స్ తో తెలంగాణాలో ఆమె పార్టీ ఏ మేరకు స్పేస్ సంపాదించగలదు అన్నది ఒక కీలకమైన ప్రశ్నగానే ఉంది. ఏది ఏమైనా షర్మిల గేర్ మార్చి జోరు పెంచారు అనే అంటున్నారు. చూడాలి మరి ఈ రెండు అరెస్టులతో ఆమె పోరు కొత్త మలుపు తీసుకుంటుందా లేక రొటీన్ గా పాదయాత్రలతో తన దారిన తాను సాగుతుందా అన్నది. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.