అందరూ కలిసి మా కొంప కూల్చారు.. గరంగరం!

Mon Oct 19 2020 20:00:49 GMT+0530 (IST)

Everyone together demolished our perch .. !

ఎవరో చేసిన పాపం.. కానీ హైదరాబాదీలను ముంచేసింది. గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ పడని వర్షం గత వారం నుంచి ఊహించని విధంగా హైదరాబాద్ పై పడింది. దీంతో నిండా మునిగిన హైదరాబాదీ ప్రజలకు పాలకులకు ఇప్పుడు తత్త్వం బోధపడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మునిగిన హైదరాబాద్ ను చూసి విలపించడం తప్ప.. చేయడానికి ఏం లేకుండా పోయింది. వరద పోయే దారులు మూసుకుపోయిన వేళ అదంతా వచ్చి ఇంట్లో తిష్టవేసింది. దీంతో కట్టుబట్టలతో హైదరాబాదీలు మురికి కూపంలో బతకాల్సిన దారుణ పరిస్థితులు ఈ వర్షాలకు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సహాయ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంపై హైదరాబాద్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నిజాం పరిపాలనలో హైదరాబాద్ నగరంలో కేవలం 7 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అప్పుడు వచ్చిన వరదలకే ఈ నగరం తట్టుకోలేదు. ఇప్పటికీ హైదరాబాద్ లో నాలాలు పెరగలేదు. డ్రైనేజీలు పెద్దవి కాలేదు. ఉన్నవాటిని కబ్జా చేసేసి ఇళ్లు నిర్మించారు. ఈ పాపంలో ప్రజలు ప్రతినిధులు పాలకులు అందరి తప్పు ఉంది.

కానీ ఇప్పుడు కేసీఆర్ పాలన వరకు వచ్చేసరికి నగర జనాభా 1.30 కోట్లకు చేరింది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ.. టీడీపీ ప్రభుత్వంలో కానీ.. ఆలోచన చేయకుండా ఏదో ఫ్లైఓవర్ లు వేశారు కానీ డ్రైనేజీలు వరదలు వస్తే ఎలా ప్రజలను కాపాడాలనే దానిపై మాత్రం ఏ పనులు చేపట్టలేదు.

కేసీఆర్ సీఎం అయిన తరువాత అయినా ఈ పనులు జరుగుతాయని అనుకుంటే అంతకన్నా దారుణంగా పరిస్థితులు ఉన్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఒక సంవత్సరం నుంచి కేవలం ఒక్క హైదరాబాద్ నగరం నుంచే 1లక్ష కోట్ల టాక్సుల రూపంలో ప్రభుత్వానికి వచ్చాయని.. వీటన్నింటిని తెలంగాణలోని అన్ని గ్రామాల్లో సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్నారని.. కానీ మేం ఎంత టాక్స్ లు కడుతున్నా మా గురించి పట్టించుకోవడం లేదు అని హైదరాబాద్ ప్రజలు వాపోతున్నారు.

డ్రైనేజ్ వ్యవస్థ రాత్రికి రాత్రే నిర్మించడం సాధ్యం కాని పని.. కానీ ఒక ప్రణాళిక పెట్టుకుంటే 5-10 సంవత్సరాల్లో అవుతుందని.. అప్పుడు వచ్చే 100 ఏళ్లకు పనికి వస్తుందని మేధావులు సూచిస్తున్నారు. ఎంతో క్లిష్టమైన మెట్రో రైలు ప్రాజెక్టు హైదరాబాద్ లో కాదు అనుకున్నారు. కానీ అది సాధ్యమైంది. అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా బాగు చేయాలని కోరుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్లకు ఆర్తిక సహాయం చేయాలని అంటున్నారు.

ఏది ఏమైనా ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని.. హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ సిటీ అని.. అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తే క్లీన్ సిటీగా ఉంటుందని సూచిస్తున్నారు. అప్పుడు బిజినెస్ కూడా బాగా అవుతుందని కూడా అంటున్నారు.