Begin typing your search above and press return to search.

ఇక.. హైదరాబాద్ కు పోటెత్తుతారేమో?

By:  Tupaki Desk   |   13 Aug 2020 7:00 AM GMT
ఇక.. హైదరాబాద్ కు పోటెత్తుతారేమో?
X
పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. నెల క్రితం వరకు హైదరాబాద్ మహానగరంలో భారీగా నమోదైన కోవిడ్ కేసులు.. గడిచిన కొన్ని వారాలుగా చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఈ రోజు (గురువారం) సంగతే తీసుకుంటే.. కేవలం 298 కేసులు మాత్రమే నమోదు కావటం గమనార్హం. హైదరాబాదీయుల్లో కోవిడ్ ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరిగిందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. విచిత్రమైన విషయం ఏమంటే.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా ఈ రోజు కేసుల సంఖ్య దగ్గర దగ్గర రెండు వేల దగ్గరకు వచ్చేశాయి. ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం చూస్తే.. 1931 కేసులు నమోదయ్యాయి.

ఇందులో హైదరాబాద్ వాటా కేవలం 298 మాత్రమే. కోవిడ్ మొదలై నాటి నుంచి మొన్నటివరకు తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 85 నుంచి 90 శాతం వరకు హైదరాబాద్ మహానగర వాటానే ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా.. 16 నుంచి 18 శాతానికి మధ్యలోనే ఉండటం గమనార్హం. అదే సమయంలో.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హైదరాబాద్ తర్వాత అత్యధిక కేసులు నమోదైంది వరంగల్ అర్బన్ (144).. రంగారెడ్డి (124).. కరీంనగర్ (89).. సంగారెడ్డి (86).. నల్గొండ (84) చొప్పున నమోదయ్యాయి.

కోవిడ్ కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. హైదరాబాద్ లో నివాసం ఉండే చాలామంది తమ ఊళ్లకు వెళ్లిపోయారు. హైదరాబాద్ లో ఉండే అత్యధికులు తెలంగాణ చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారితో పాటు.. పక్కనున్న ఏపీకి చెందిన వారు. కేసులు పెరిగిపోతున్న వేళలో.. అటు ఏపీలోనూ.. ఇటు తెలంగాణలోని జిల్లాల్లోనూ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. దీంతో.. లక్షలాదిగా వెళ్లిపోయారు. దీనికి తోడు వర్క్ ఫ్రం హోం కావటంతో.. ఇంటి నుంచే కనెక్టు అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. కొద్దిరోజులుగా హైదరాబాద్ లో నమోదయ్యే కేసుల సంఖ్య బాగా తగ్గిపోగా.. జిల్లాల్లోనూ ఏపీలోనూ భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో కేసుల సంఖ్య మరికాస్త తగ్గితే.. లక్షలాదిగా ఊరుకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ కు పోటెత్తటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంటుందా? అన్నది మరో క్వశ్చన్.