Begin typing your search above and press return to search.

దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలగా హుజూరాబాద్ ఉప ఎన్నిక

By:  Tupaki Desk   |   29 July 2021 4:54 AM GMT
దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలగా హుజూరాబాద్ ఉప ఎన్నిక
X
దేశంలోని మరే రాష్ట్రాల్లో లేని రీతిలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చుభారీగా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. ఎన్నిక ఏదైనా.. అభ్యర్థి ఎలాంటి వాడైనా.. డబ్బులు కీలక భూమిక పోషిస్తున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అభ్యర్థుల గుణగణాల కంటే కూడా.. డబ్బులతో ఎన్నికల్ని ప్రభావితం చేయాలన్న ధోరణి ప్రమాదకరంగా మారింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. హుజూరాబాద్ లో జరిగే ఉప ఎన్నికల్లో డబ్బులు నీళ్ల మాదిరి ప్రవహించటం ఖాయమంటున్నారు.

తెలంగాణ అధికారపక్షం ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం తెలిసిందే. మాజీ మంత్రి.. ఒకప్పుడు తనకు అత్యంత సన్నిహితుడైన ఈటల రాజేందర్ ను రాజకీయంగా భూస్థాపితం చేయటంతో పాటు.. బీజేపీకి అంత సీన్ లేదన్న విషయాన్ని తేల్చేయటం.. కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ మాత్రం ఉండదన్న విషయాన్ని స్పష్టం చేయాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు పలు ఉప ఎన్నికలు జరిగినా.. మరే ఉప ఎన్నికకు ఇవ్వనంత ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నారు.

ఈ ఉప ఎన్నిక కోసం ఏకంగా దళిత బంధు అన్న పథకాన్ని తెర మీదకు తీసుకురావటం.. ఇప్పుుడు చర్చంతా దాని చుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. మొదట అనుకున్నదానికి భిన్నంగా.. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టును హుజూర్ నగర్ లో ఏర్పాటు చేయటం ద్వారా.. తానేం కోరుకుంటున్నానన్న విషయాన్ని సీఎం కేసీఆర్ చెప్పకనే చెప్పేస్తున్నారని చెప్పాలి. ఈ మధ్యన ఎన్నికల వేళలో పథకాల్ని అమలు చేయటం తప్పేం కాదన్న ఆయన వాదనను పలువురు సమర్థిస్తే.. మరికొందరు విమర్శిస్తున్నారు. తొలుత అనుకున్నట్లుగా ప్రతి గ్రామంలో వంద మంది లబ్థిదారుల్ని ఎంపిక చేయాలని భావించారు.

ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తే.. భారీగానే లబ్థి పొందే వారి జాబితా పెద్దదిగానే ఉంటుందంటున్నారు. ఇదే కాక.. తెలంగాణ ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీగా హుజూరాబాద్ మారింది. అక్కడి నుంచి వచ్చే ఏ విన్నపాన్ని అయినా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఆదేశాలు జారీ అవుతున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకు ముందే ఇంత హడావుడి ఉంటే.. నోటిఫికేషన్ విడుదల తర్వాత విషయం ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. రాజకీయ వర్గాల అంచనా ప్రకారం.. ఈ ఉప ఎన్నిక కు మొత్తం వెయ్యి కోట్ల వరకు రాజకీయ పార్టీలన్ని ఖర్చుచేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.

రూ.500కోట్ల కంటే తక్కువ ఖర్చు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరనే కుదరదని.. తెలంగాణ అధికారపక్షం నుంచి కూడా భారీ స్తాయిలో ఖర్చుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అధికారపక్షానికి ధీటుగా ఈ ఎన్నికల్లో ఖర్చుచేయటానికి ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారంటున్నారు. ఇప్పటివరకుపలు ఉప ఎన్నికలు జరిగినా.. తాజాగా జరిగే ఉప ఎన్నిక మాత్రం దేశ వ్యాప్తంగా అందరి చూపు పడేలా చేయటమే కాదు.. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో డబ్బుల్ని మంచినీళ్ల కంటే దారుణంగా ఖర్చు చేసిన రికార్డు సొంతమవుతుందని చెబుతున్నారు.

ఎన్నికల ఫలితాల్ని డబ్బు ప్రభావితం చేసినట్లుగా రుజువైన పక్షంలో రాబోయే జరిగే ఎన్నికలు మొత్తం ‘ఖర్చు’ చుట్టూనే జరుగుతుందని చెప్పక తప్పదు. తెలుగు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్ ను హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్దేశిస్తుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.