Begin typing your search above and press return to search.

సీపీఎంకు ఉప ఎన్నిక సెగ‌

By:  Tupaki Desk   |   10 Oct 2019 4:35 AM GMT
సీపీఎంకు ఉప ఎన్నిక సెగ‌
X
హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక సెగ సీపీఎంను తాకింది. హుజూర్‌ న‌గ‌ర్‌ లో పోటీకి దిగుతామ‌ని ప్ర‌క‌టించిన సీపీఎం పార్టీ అభ్య‌ర్థిగా పారేప‌ల్లి శేఖ‌ర్‌ రావును అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. ఈమేర‌కు ఆయ‌న నామినేష‌న్ కూడా దాఖ‌లు చేశారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఆయ‌న నామినేష‌న్ ను అధికారులు ప‌లు సాంకేతిక కార‌ణాల‌తో తిర‌స్క‌రించ‌డంతో పార్టీ శ్రేణులు షాక్‌ కు గుర‌య్యారు. దీంతో వెంట‌నే పార్టీ నాయ‌కులు దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు.

రాష్ట్ర క‌మిటీ రెండు సార్లు - జిల్లా క‌మిటీ మూడు సార్లు ఇదే అంశంపై ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైంది. ర‌క‌ర‌కాల చ‌ర్చ‌ల త‌ర్వాత చివ‌ర‌కు నిర్ల‌క్ష్యంగా నామినేష‌న్ దాఖ‌లు చేశార‌న్న కార‌ణంతో పారేప‌ల్లి శేఖ‌ర్‌ రావును పార్టీ నుంచి సంవ‌త్స‌ర కాలంపాటు స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేగాక హుజూర్‌ న‌గ‌ర్‌ లో జ‌రిగిన జిల్లా క‌మిటీ స‌మావేశంలోనూ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హిరించ‌లేద‌న్న కార‌ణంతో సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి ముల్క‌ల‌ప‌ల్లి రాముల‌ను కూడా జిల్లా బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు.

ఇద్ద‌రు నేత‌లు పార్టీ నుంచి స‌స్పెండ్ కావ‌డంతో క్యాడ‌ర్‌ లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లంరేపింది. మ‌ల్లు నాగార్జున‌రెడ్డిని జిల్లా కార్య‌ద‌ర్శిగా ఏక‌గ్రీవంగా ఎంపిక చేస్తూ - తీర్మానం చేశారు. నాగార్జునరెడ్డి ప్ర‌ముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మ‌ల్లు స్వ‌రాజ్యం-మ‌ల్లు వెంక‌ట న‌ర్సింహ‌రెడ్డిల కుమారుడు. ఈయ‌న గ‌తంలోనూ ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. మొత్తానికి పార్టీ అభ్య‌ర్థిని బ‌రిలో నిలిపి త‌మ బ‌ల‌మేంటో చూపించాల‌నుకున్న సీపీఎం నాయ‌కుల ఆలోచ‌న త‌ల‌కిందులైంది. బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థినే పార్టీ నుంచి తొల‌గించ‌డానికి కార‌ణ‌మైంది.

ఇక గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్కడ నుంచి పార్టీ త‌ర‌పున పోటీ చేసిన శేఖ‌ర్‌ రావు నామినేష‌న్ ఈ ఎన్నిక‌ల్లో తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వ్వ‌డంతో ప‌లు సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక ఇక్క‌డ పార్టీ అభ్య‌ర్థి పోటీలో లేక‌పోవ‌డంతో ఓ స్వ‌తంత్య్ర అభ్య‌ర్థికి సీపీఎం స‌పోర్ట్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇదిలా ఉంటే పార్టీ నుంచి ఇద్ద‌రు నేత‌లను స‌స్పెండ్ చేస్తూ - హైక‌మాండ్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప‌లువురు నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఉప ఎన్నిక సీపీఎంలో చిచ్చుపెట్టింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.