ఏపీలో భార్యను ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టిన భర్త!

Tue Dec 06 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

Husband Hacked His Pregnant Wife To Death In Visakhapatnam

ఇటీవల ఢిల్లీలో శ్రద్ధావాకర్ అనే అమ్మాయిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ అనే యువకుడు 35 ముక్కలుగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. అందరినీ ఈ ఘటన నివ్వెరపరిచింది.ఇప్పుడు ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ భర్త గర్భిణి అయిన తన బార్యను ముక్కలుగా నరికి చంపడం కలకలం సృష్టిస్తోంది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళ్తే.. విశాఖపట్నంలోని మధురవాడలో రుషి అనే వ్యక్తి తన భార్యతో నివసిస్తున్నాడు. అయితే ఏడాది కాలంగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. రుషి దినసరి కూలీగా పనిచేస్తుండగా భార్య గర్భిణి. ఇంటికి తాళం వేసి ఉండటంతో భార్యాభర్తలిద్దరూ వారి తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లారని అందరూ భావించారు. అందులోనూ రిషి భార్య గర్బిణి కావడంతో ఎవరూ అనుమానించలేదు. కాన్పు కోసం పుట్టింటికి వెళ్లి ఉంటుందని అనుకున్నారు.

దీంతో ఏడాది కాలంగా ఇంటికి తాళం వేసి ఉన్నప్పటికి ఎవరికీ అనుమానం రాలేదు. అయితే రెండు రోజుల నుంచి ఆ తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు ఇంటి యజమానికి ఫోన్ చేశారు. అతడు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంటిలోపల ప్లాస్టిక్ డ్రమ్మును గమనించిన యజమాని అక్కడ నుంచే దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు.

దీంతో డ్రమ్ము లోపల పరిశీలించగా ప్లాస్టిక్ సంచుల్లో గర్భిణి మృతదేహాన్ని ముక్కలుగా చేసి అందులో ఉంచినట్లు గుర్తించారు. దీంతో భయాందోళనలకు గురయిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాదిన్నరగా శరీరం కుళ్లిపోయి ఉండొచ్చని అర్థమైంది. భర్తపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రుషి (40) పోలీసుల అదుపులో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. రుషి స్వస్థలం పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట అని చెబుతున్నారు. హత్యలో నిందితుడికి సహకరించిన వ్యకులెవరు? ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే వివరాలను రాబడుతున్నారు. ప్లాస్టిక్ సంచుల్లో ముద్దలుగా మారి కుళ్లిన స్థితికి చేరిన శరీర భాగాలను శవపరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు పంపించారు. ఆ నివేదికను విశ్లేషిస్తున్నారు.

హత్య జరిగిన నివాసంలో క్లూస్ టీం సభ్యులు వేలిముద్రలు సేకరించారు. పోలీసులు ఐదు బృందాలుగా నగరంతోపాటు విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతోపాటు అతడికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. అతని కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. రుషి తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో కొన్ని నెలలుగా ఉండడం లేదు. దీంతో ఆయన ప్రస్తుత నివాసానికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టారు.
 
కాగా హత్యకు గురైన మహిళ తలభాగం పూర్తిగా కుళ్లిపోయి పుర్రె మాత్రమే మిగిలింది. మృతదేహం అంతగా కుళ్లిపోయినా పరిసర ప్రాంతాల వారికి ఏమాత్రం వాసన రాకుండా.. ప్లాస్టిక్ సంచుల్లో కుక్కాడు. ఆ ప్లాస్టిక్ సంచులను వాటర్ డ్రమ్ములో పెట్టి ఉంచాడు.  ఈ నేపథ్యంలో ఏమాత్రం వాసన రాకుండా నిందితుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయా అంశాలపైనా పోలీసులు కూపీ లాగుతున్నారు.