జీహెచ్ఎంసీలో హంగ్.. టీఆర్ఎస్ షాక్.. మేయర్ పీఠం ఎవరిది?

Fri Dec 04 2020 19:50:26 GMT+0530 (IST)

Hung in GHMC .. TRS Shock .. Whose mayoral seat is it?

టీఆర్ఎస్ ఆశలు అడియాసలయ్యాయి. కేసీఆర్ ఎంత విజ్ఞప్తి చేసినా గ్రేటర్ ఓటరు పట్టించుకోలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయ శక్తిని తనే వెతుక్కున్నాడు. బీజేపీకి కూడా దాదాపు టీఆర్ఎస్ అన్ని సీట్లు ఇచ్చి కేసీఆర్ కు పక్కలో బల్లెంలా తయారు చేశాడు. ఇన్నాళ్లు ఆడింది ఆటలా సాగిన టీఆర్ఎస్ సర్కార్ కు ఇక ముందు జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితిని కల్పించాడు. టీఆర్ఎస్ కు జలక్ ఇస్తూ హైదరాబాద్ లో హంగ్ సృష్టించారు హైదరాబాదీలు.గ్రేటర్ ఫలితాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కుదేలైన వేళ ఇక తమకు ఎదురే లేదని విర్రవీగిన గులాబీ దండుకు గ్రేటర్ లో కమలదళాన్ని గెలిపించి దాదాపు చెక్ చెప్పారనే చెప్పొచ్చు.

తెలంగాణలో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఏదో ఒక పార్టీకే పట్టం కట్టారు. కానీ దుబ్బాక ఫలితం నుంచి సీన్ మారుతోంది. దుబ్బాకలో కేవలం వెయ్యికి పైగా ఓట్లతోనే బీజేపీ అభ్యర్థి గెలిచాడు. ఇప్పుడు హైదరాబాదీ ఓటరు ఏకంగా హంగ్ ఇచ్చాడు. ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వకుండా డోలాయమానంలోకి నెట్టాడు.

తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తుదిదశకు చేరాయి. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ 56 స్తానాలతో లీడింగ్ లో ఉంది. ఆ తర్వాత ఎంఐఎం 42 స్థానాల్లో గెలిచి 1 స్థానంలో లీడ్ లో ఉంది. బీజేపీ 45 గెలిచి 4 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

ప్రస్తుతం మేయర్ పీటం ఏ ఒక్కపార్టీకి దక్కే అవకాశాలు లేవు. మిత్రపక్షాలైన టీఆర్ఎస్ ఎంఐఎం కలిస్తే మేయర్ పీఠాన్ని అధిరోహించవచ్చు. బీజేపీతో టీఆర్ఎస్ ఎంఐఎం కలువదు కాబట్టి అది ప్రతిపక్షంలోనే ఉండనుంది.

ఒక వేళ ఎంఐఎం మద్దతు లేకుండా గ్రేటర్ పీఠాన్ని ఎక్స్ ఆఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ సొంతం చేసుకోవచ్చు. దాదాపు 41 ఎక్స్ అఫిషియో సీట్లు టీఆర్ఎస్ కి ఉన్నాయి. ఇప్పుడు 56 సీట్లు రావడంతో 41 కలిపితే 97 సీట్లు అవుతాయి. అప్పుడు ఈజీగా మేయర్ పీఠం సాధించవచ్చు. మరి ఫలితాలు పూర్తిగా వెలువడితే కానీ క్లారిటీ రాకపోవచ్చు.