Begin typing your search above and press return to search.

రోజూ వందల మంది చిన్నారులు మృత్యు ఒడిలోకి

By:  Tupaki Desk   |   26 July 2021 7:31 AM GMT
రోజూ వందల మంది చిన్నారులు మృత్యు ఒడిలోకి
X
కరోనా రక్కసి ఏ ముహూర్తాన ప్రజల మీద దాడి చేయడం ఆరంభించిందో గానీ ఏళ్లు గడుస్తున్నా దాని ఛాయలు పూర్తిగా పోవడం లేదు. ప్రతి రోజు కొత్త వేరియంట్ పుట్టుకొస్తూ... జనాలకు నిద్ర లేకుండా చేస్తున్న మహమ్మారి ఏషియాలోని ఇండోనేషియాను వణికిస్తుంది. శాస్త్రవేత్తలు ఎన్ని కష్టాలు పడి వ్యాక్సిన్ తీసుకువచ్చినా డ్రెస్ మార్చుకున్నంత ఈజీగా తన రూపాన్నే మార్చుకుని కొత్త సవాల్ విసిరింది. ఆ సవాల్ ను స్వీకరించేలోపే చాలా దేశాలను అతలాకుతలం చేస్తోంది. సెకండ్ వేవ్ కారణంగానే అల్లాడిపోయిన ప్రపంచ దేశాలు ప్రస్తుతం విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వేరియంట్లతో బెంబేలెత్తి పోతున్నాయి.

ఇండోనేషియాలో ఇప్పటి వరకు నూతనంగా పుట్టుకొచ్చిన డెల్టా వేరియంట్ వల్లే 27 లక్షల కేసులు వెలుగు చూడడం గమనార్హం. ఇండోనేషియాలో పెరుగుతున్న కోవిడ్ మరణాలు ఆ దేశంలో భయానక పరిస్థితులను క్రియేట్ చేస్తున్నాయి. తొలి నాళ్లలో కేవలం ఒకరిద్దరు కరోనా పేషెంట్ల అంత్యక్రియలు చేసిన సిబ్బందికి ప్రస్తుతం రోజుకు 20–30 మంది అంత్యక్రియలు చేయాల్సి రావడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత వెరసి చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే అక్కడ కోవిడ్ చికిత్సలో వాడే మందులు కూడా దొరకకపోవడంతో దేశం అల్లాడిపోతుంది.

నిన్న మొన్నటి వరకు భారతదేశంలో కనిపించిన దయనీయ పరిస్థితులు ప్రస్తుతం ఇండోనేషియాలో దర్శనమిస్తున్నాయి. మరో బాధాకరమైన విషయం ఏంటంటే కరోనా రక్కసి బలైపోతున్న వారిలో అధిక మంది చిన్నారులు ఉండడం. గతంతో పోలిస్తే రోజురోజుకూ పిల్లల్లో మరణాల రేటు పెరుగుతూ పోతుంది. నిత్యం వందల మంది చిన్నారులు ఈ మహమ్మారి దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలా కరోనాతో కన్ను మూస్తున్న వారిలో అనేకం ఐదేళ్ల లోపు వారే ఉండడం విచారకరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో నివసించే పిల్లలతో పోలిస్తే కేవలం ఇండోనేషియాలోనే కరోనా రక్కసి కి అధిక శాతం మంది పిల్లలు బలవ్వడం గమనార్హం.

ఈ నెలలో ఇండోనేషియాలో వారానికి వంద మంది కన్నా ఎక్కువ సంఖ్యలో కరోనా మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు ఇండోనేషియాలో వచ్చిన పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతమే అధికంగా వస్తున్నట్లు అక్కడి అధికారులు వాపోతున్నారు. ఇప్పటి వరకు దేశంలో 50 వేల కొత్త కేసులు పుట్టుకురాగా... దాదాపు 1566 మంది కన్నుమూశారు. జూలై 12 ఒక్కరోజే ఇండోనేషియాలో దాదాపు 150 మందికి పైగా చిన్నారులు కరోనా రక్కసికి బలయ్యారు. గడిచిన వారంలో 500 మంది చిన్నారులు కరోనాతో కన్ను మూయడం ఆందోళన కలిగించే విషయం.

మొత్తం మీద ఇండోనేషియా దేశంలో దాదాపు మూడు మిలియన్ల మంది కరోనా బారిన పడగా.. 83 వేల మంది మరణించారు. 2020లో ఇండోనేషియాలో 800 మందికి పైగా చిన్నారులు కరోనా కోరల్లో చిక్కుకుని చనిపోయారు. ఇప్పటి వరకు సంభవించిన కోవిడ్ మరణాలతో పోల్చుకుంటే గత నెలలోనే అధికంగా కోవిడ్ మరణాలు సంభవించినట్లు అక్కడి వైద్య నిపుణులు తెలుపుతున్నారు.