చైనాలో ఆ ప్రావిన్స్ లో వర్ష బీభత్సం.. వందలాది కార్లు పేపర్ పడవలయ్యాయ్

Thu Jul 22 2021 11:07:18 GMT+0530 (IST)

Hundreds of cars washed away in China Floods 2021

కరోనా మహమ్మారితో ప్రపంచానికి నిద్ర లేకుండా చేసిన చైనాకు తాజాగా కురిసిన కుండబోత వర్షం భారీగా కుదిపేసింది. తానేం చేసినా నడిచిపోతుందన్నట్లుగా విర్రవీగే ఆ దేశంలోని ఒక ప్రాంతంలో కురిసిన భారీవర్షం.. ఇప్పుడా దేశానికి చుక్కలు చూపిస్తోంది. తన సరిహద్దు దేశాలతో ఏదోలా గిల్లికజ్జాలు పెట్టుకునే చైనాలోని హెనన్ ప్రావిన్స్ లో కురిసిన వర్షం.. వెయ్యేళ్లలో కూడా ఇలాంటి వర్షాన్ని చూడలేదంటున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా పాతిక మంది ఇప్పటివరకు మరణించినట్లు చెబుతున్నారు. దాదాపు 12.4 లక్షల మందిపై దీని ప్రభావం పడినట్లుగా తెలుస్తోంది.1.6 లక్షల మందిని హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనా కాలామానం ప్రకారం ముంగళవారం రాత్రి ఉన్నట్లుండి వరద నీరు పోటెత్తటంతో సబ్ వే రైళ్లలో నడుము లోతు నీళ్లు చేరుకోవటంతో అందులో ఇరుక్కుపోయారు. దీంతో.. పలువురు మరణించారు. తాజాగా కురిసిన కుండపోతతో హెనన్ ప్రావిన్స్ అల్లాడిపోయింది. మరి ముఖ్యంగా దాని రాజధాని నగరమైన ఝెన్ ఝౌలో వణికిపోయింది. చైనా ఎన్ని పాడు పనులు చేసినా.. అడ్డుకునే వారెవరూ లేరా? ప్రకృతి సైతం షాకివ్వదా? అన్న మాట పలువురి నోట వినిపిస్తున్న వేళలోనే.. ఇలాంటి విపత్తు చోటు చేసుకోవటం గమనార్హం.

తన బలాన్ని గొప్పగా చెప్పుకుంటూ.. ప్రపంచ దేశాలపై తరచూ విరుచుకుపడే చైనా తాజా వర్షం భారీ షాకిచ్చిందని చెబుతున్నారు. వర్షం కారణంగా చోటు చేసుకున్న సీన్లు.. భయానకంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రకృతి విలయానికి చైనీయులు వణికే పరిస్థితి నెలకొందంటున్నారు. హెనన్ ప్రావిన్స్ కు ఉన్న ప్రత్యేకత ఏమంటే.. ఐఫోన్ల తయారీ యూనిట్ తో సహా పలు పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. అలాంటి ప్రావిన్స్ భారీ వర్షంతో చోటు చేసుకున్న వరదలో చిక్కుకొని కిందామీదా పడుతోంది.

వరద నీటిలోనే అక్కడి ప్రజలు నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్న వైనం ఒక ఎత్తు అయితే.. వందలాది కార్లు కాగితపు పడవల మాదిరి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. పెద్ద ఎత్తున బస్సులు.. లారీలు.. టిప్పర్లు ఇలా అన్ని వాహనాలు వరద నీటిలో మునిగిపోయిన వైనం షాకింగ్ గా మారింది. ఐఫోన్ సిటీగా పిలిచే ఝెన్ ఝౌలో ఒక్క రోజులోనే 45.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. శనివారం నుంచి మంగళవారం నాటికి 64 సెంటీమీటర్ల వర్షం కురిస్తే.. 24 గంటల వ్యవధిలో కురిసిన 45.7 సెంటీమీటర్ల వర్షం భారీ విధ్వంసాన్ని దారి తీసింది.

గడిచిన వెయేళ్లలో ఆ ప్రాంతంలో అంత భారీ వర్షపాతం నమోదు కావటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. భారీ వర్షాలతో ఏర్పడిన వరద నేపథ్యంలో చైనా అధ్యక్షుడు సైతం స్పందించారు. సహాయక చర్యల కోసం సైన్యాన్ని పంపుతున్నట్లు చెప్పారు. నగరంలో విద్యుత్.. మంచినీటి సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. ఆసుపత్రుల్లోనూ కరెంట్ సరఫరా లేకుండా పోయింది. యుద్ధ విద్యలకు నెలువైన షావొలిన్ టెంపుల్ సైతం వరదలకు భారీగా దెబ్బ తినటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అంతకంతకూ పెరుగుతున్న వరద నీటిని మళ్లించేందుకు.. వర్షాల కారణంగా దెబ్బ తిన్న యిహెతన్ ఆనకట్టను చైనా సైన్యం పేల్చేసింది. ఈ ఆనకట్టకు 20 మీటర్ల మేర పగళ్లు ఏర్పడటంతో.. అదే క్షణంలో అయినా కొట్టుకుపోవచ్చన్న ఉద్దేశంతో.. సైన్యమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా వరుణుడి దెబ్బకు చైనాలోని ఒక ప్రాంతం అతలాకుతలమైంది.