Begin typing your search above and press return to search.

రాజీవ్ హంతకులకి దీర్ఘకాలిక పెరోల్‌ .. 2, 3 రోజుల్లోనే .. !

By:  Tupaki Desk   |   18 Jun 2021 3:30 PM GMT
రాజీవ్ హంతకులకి  దీర్ఘకాలిక పెరోల్‌ .. 2, 3 రోజుల్లోనే .. !
X
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకేసు నిందుతులకి దీర్ఘకాలం ఆంక్షలు, షరతులతో జైలు బయట ఉండేందుకు వీలుగా పెరోల్‌ నిబంధనల్లో మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వ్యవహారం పై మరో రెండు , మూడు రోజుల్లోనే ఓ కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితులను విడుదల చేయాలని గత మంత్రి వర్గం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ తీర్మానాన్ని గవర్నర్‌ రాష్ట్రపతికి పంపడం తెలిసిందే. తమను విడుదల చేస్తూ చేసిన తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని నిందితులు న్యాయ పోరాటం చేశారు. చివరకు అది మళ్లీ రాష్ట్రపతి కోర్టుకి చేరింది. ఇక ఎన్నికల్లో గెలిస్తే నిందితుల విడుదలకి సహాయం చేస్తామని డీఎంకే ప్రకటించింది. అన్నట్టుగానే ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అయితే, దీనికి కొన్ని చట్టపరమైన చిక్కులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన కుమారుడితో సహా మిగిలిన వారిని విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని పేరరివాలన్‌ తల్లి అర్బుదమ్మాల్‌ బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎం స్టాలిన్‌ ను కలిసి విజ్నప్తి చేశారు. వారి విడుదలకు ఎదురవుతున్న చట్టపరమైన చిక్కుల్ని అధిగమించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ మేరకు నిందితులు ఎక్కువ కాలం జైలులో కాకుండా షరతులు, నిబంధనలకు అనుగుణంగా తమ కుటుంబంతో కలిసి ఉండేందుకు వీలుగా ఈ మార్గాన్ని ఎంచుకునే పనిలో పడినట్టు సమాచారం. వీరి కోసమే పెరోల్‌ నిబంధనల్ని మార్పులు చేయడానికి కసరత్తులు సాగుతున్నాయి. నిందితులు ఏడుగురిలో పెరరివాలన్, నళిని, రవిచంద్రన్‌ మాత్రం తమిళనాడుకు చెందిన వారు. మిగిలిన నలుగురు శ్రీలంకకు చెందిన వారు. ఆ ముగ్గురు కుటుంబంతో గడిపేందుకు వీలుగా, మిగిలిన నలుగురిని శ్రీలంకకు పంపించకుండా ఇక్కడి శరణార్థుల శిబిరంలో హాయిగా జీవించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

1991 మే నెలలో తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు ద్వారా హత్య చేశారు. ఆ కేసులో హంతకులు పెరారివలన్, మురుగన్, శాంతం, నళిని శ్రీహరన్, రాబర్ట్ పయస్, జయ కుమార్, రవి చంద్రన్‌ లకు జీవిత ఖైదు విధించారు. వీరంతా తమిళనాడులోని వేర్వేరు జైళ్లలో శిక్షను అనుభవించారు. శిక్షా కాలం కూడా పూర్తి చేసుకున్నారు. అయితే వీరి విడుదల చేయాలంటూ తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం 2018లో సిఫారసు చేసింది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో కూడా పటిషన్‌ దాఖలు కాగా రాజీవ్‌ హంతకులను విడుదల చేయడం సరికాదని కేంద్రం న్యాయస్థానానికి స్పష్టం చేసింది. అయితే వీరి విడుదల నిర్ణయం విషయంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టు ఇటీవల విచారం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసులు రెండేళ్ళ నుంచి పెండింగ్‌లో ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.దీంతో తమిళనాడు గవర్నర్ నుండి ఈ వ్యవహారం రాష్ట్రపతి కోర్టుకి బదిలీ అయింది.