కరోనా దెబ్బ: ఎక్కడ చూసినా టు-లెట్

Tue Jul 07 2020 09:45:02 GMT+0530 (IST)

Pandemic Effect : To let boards EveryWhere

కరోనా దెబ్బకు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. కొందరు రిటైర్ మెంట్లు తీసుకొని మరీ అపార్ట్ మెంట్లు కట్టి అందులోని ఇళ్లను రెంట్ కు ఇచ్చి వాటితో బతికేవారు. ఇప్పుడు వారందరి పరిస్థితి తలకిందులైంది. అద్దె ఇళ్లపై బతికే వారందరిపై కరోనా పిడుగు పడింది.ఇంతకాలం మూడు పువ్వులు-ఆరుకాయలుగా సాగిన అద్దె ఇళ్ల వ్యాపారం ఇప్పుడు యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ పడిపోయింది. కరోనా భయంతో అందరూ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఎక్కడ చూసినా టు-లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇన్నాళ్లు నగరాలకు విద్యా ఉద్యోగం ఉపాధి వ్యాపారాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో అద్దెఇళ్లకు ధరలు భారీగా ఉండేవి. ఇప్పుడు అందరూ వెళ్లిపోవడంతో ఇళ్లు అద్దెకు తీసుకునే వారు లేక ఈగలు తోలుకునే పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్ లాంటి చోట సొంత ఇల్లు ఉంటే ఆ అద్దెలతోనే బతికేయవచ్చు. అంత డిమాండ్ ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కరోనా ధాటికి ఇప్పుడు అద్దె ఇళ్లు మొత్తం ఖాళీ అయిపోయారు. అందరూ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో అద్దె ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా టు లెట్ బోర్డులే. సగం ధరకే ఇళ్లు ఇస్తామన్నా ఎవరూ రాని పరిస్థితి.

మూడు నాలుగు నెలలుగా అద్దె ఇళ్లు ఖాళీగా ఉండడం తో నిర్వహణ పన్నులు కరెంట్ బిల్లుల భారం యజమానులపై పడి బావురు మంటున్నారు. సామాన్యులకే కాదు.. వ్యాపార సముదాయాల వరకు ఉపాధి కోల్పోయి ఇళ్లు కార్యాలయాలు అన్నీ ఖాళీ చేయడంతో యజమానులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్కూళ్లు కాలేజీలు శిక్షణ సంస్థలు ప్రారంభం కాకపోవడంతో అద్దె ఇళ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. దీంతో భవనాల నిర్వహణవాటిపై తీసుకున్న ఈఎంఐల చెల్లింపులు యజమానులకు భారంగా మారాయి. కరోనా దెబ్బకు లాభమనుకున్న ఈ వ్యాపారం పుట్టెడు నష్టాల పాలైంది.