Begin typing your search above and press return to search.

ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. ఇప్పటిదాకా 640 మంది బలి!

By:  Tupaki Desk   |   6 Feb 2023 2:51 PM GMT
ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. ఇప్పటిదాకా 640 మంది బలి!
X
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపం ధాటికి ఆ రెండు దేశాలు చిగురుటాకుల్లా వణికాయి. టర్కీ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భారీ భూకంపం సంభవించింది.

ఆగ్నేయ టర్కీలోని గాజియాన్‌ తెప్‌ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రిక్టర్‌ స్కేల్‌ పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో దక్షిణ టర్కీ ప్రాంతం, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది.

7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని వార్తా సంస్థలు వెల్లడించాయి. దీంతో ప్రమాద తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

భారీ భూకంప తీవ్రతతో టర్కీతోపాటు సిరియా దేశాల్లో పెను విపత్తు చోటు చేసుకుంది. వేలాది భవనాలు కుప్పకూలాయి. రెండు దేశాల్లో అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయని తెలుస్తోంది.

భూకంపం తీవ్రతకు సిరియా, టర్కీ రెండు దేశాల్లో ఇప్పటివరకు 640 మందికి పైగా మృత్యువాత పడ్డారు. రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపంతో వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు. కుప్పకూలిన భవనాల్లో వందల సంఖ్యలో ప్రజలు ఉన్నారని చెబుతున్నారు.

ప్రధానంగా టర్కీలోని దియర్‌ బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. టర్కీలోని మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం ప్రళయం సృష్టించింది. దీంతో ఇప్పటివరకు టర్కీలో 284 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అలాగే 2,300 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు.

అదేవిధంగా సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో 237 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. మరో 639 మంది గాయపడినట్లు వెల్లడించింది. కాగా.. రెబల్స్‌ అధీనంలో ఉన్న సిరియాలోని ప్రాంతాల్లో కనీసం 120 మంది మరణించినట్లు సమాచారం. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు.

కాగా టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ పెను విపత్తులో మరణించిన కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.