Begin typing your search above and press return to search.

గ్లోబల్ టెండర్లకు వెళ్లిన కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్

By:  Tupaki Desk   |   5 Jun 2021 9:48 AM GMT
గ్లోబల్ టెండర్లకు వెళ్లిన కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్
X
కొవిడ్ వ్యాక్సిన్ కు ఇప్పుడు తీవ్రమైన డిమాండ్ ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇలాంటి వేళ.. వ్యాక్సిన్ కోసం దేశాలకు దేశాలు పోటీ పడుతున్నాయి. ఇలాంటి వేళ.. కేంద్రాన్ని కాదని..కొరతను అధిగమించటానికి వీలుగా తమకుతామే గ్లోబల్ టెండర్లకు పోతామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి చేరారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

తాము కోరినన్న వ్యాక్సిన్లను కేంద్రం సరఫరా చేయని నేపథ్యంలో.. తమకుతామే సమకూర్చుకుంటామని.. అందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తామని కేసీఆర్ ఘనంగా చెప్పుకున్నారు. అన్నట్లే గ్లోబల్ టెండర్లను పిలిచారు. దానికి ఆఖరు తేదీ శుక్రవారం. గడువు ముగిసే నాటికి ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా సారు ఆహ్వానించిన గ్లోబల్ టెండర్ కు బిడ్ వేయటానికి రాని పరిస్థితి. దీంతో.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

గ్లోబల్ టెండర్లకు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఏ మాత్రం ఆసక్తిని ప్రదర్శించకపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. కంపెనీలకు విపరీతమైన డిమాండ్ ఉండటం.. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్లోబల్ టెండర్ వైపు ఆసక్తిని ప్రదర్శిస్తే.. కేంద్రంతో తలనొప్పులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే కంపెనీలు ముఖం చాటేశాయని చెబుతున్నారు. దీనికి తోడు.. గ్లోబల్ టెండర్లకు పిలిచినా.. వ్యాక్సిన్ కంపెనీలు వాటిని చేసే పరిస్థితి లేదు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు టీకాల కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయి. వరుస క్రమంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాయి.

ఇలాంటి పరిస్థితి ఉన్న వేళలో.. భారత్ లోని రాష్ట్రాలు టెండర్లకు పిలిస్తే ఎవరైనా ఎందుకు వస్తారన్న మాట వినిపిస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి ఈ చేదు అనుభవం ఎదురైంది కానీ.. అంతకు ముందు ఏపీ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితే. ఆ మాటకు వస్తే.. ఒక్క మహారాష్ట్ర మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఇలాంటి పరిస్థితే. ఇంతకూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన గ్లోబల్ టెండర్లకు 8 బిడ్లు ఎందుకు వచ్చాయన్న విషయాన్ని చూస్తే.. టీకా కంపెనీలు ఏవీ నేరుగా బిడ్ వేయలేదు. కొందరు మధ్యవర్తులు వేశారని చెబుతున్నారు. వారిలో ఎంపిక చేసిన తర్వాత కేంద్రం ఆమోదం పొందాల్సి ఉంటుంది. దీని కంటే కూడా.. కేంద్రంతోనే డైరెక్టుగా డీల్ చేసుకోవటమే మంచిదన్న ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.