Begin typing your search above and press return to search.

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం .. కొల్లు రవీంద్రకు పోలీసు నోటీసులు !

By:  Tupaki Desk   |   5 Dec 2020 5:38 AM GMT
మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం .. కొల్లు రవీంద్రకు పోలీసు నోటీసులు !
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని పై జరిగిన హత్యాయత్నం కేసులో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం పోలీసులు నోటీసులు అందించారు. సీఆర్ ‌పీసీ సెక్షన్‌ 91 కింద విచారణకు హాజరు కావాల్సిందిగా కోరుతూ కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి ఇనగుదురుపేట సీఐ శ్రీనివాస్‌ నోటీసులు అందజేశారు.

తొలుత కొల్లు రవీంద్ర ఇంటికి వచ్చిన సీఐ విచారణకు రావాలని కోరారు. ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని రవీంద్ర తేల్చి చెప్పారు. ఈ సమయంలో డీఎస్పీ రమేశ్‌ రెడ్డితో కూడా ఫోనులో మాట్లాడిన కొల్లు రవీంద్ర ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చడు. అయితే విచారణకు హాజర్ కావాలంటే ఏదైనా నోటీసు ఇస్తే వస్తానని చెప్పారు. దీంతో సీఐ నోటీసును తీసుకుని మళ్లీ కొల్లు రెవీంద్ర ఇంటికి వచ్చారు. దీనిపై ఆయన ఎండార్స్‌మెంట్ రాసి ఇచ్చారు. తనకు వ్యక్తిగత పనులున్నాయని, వారం రోజుల్లో విచారణకు హాజరవుతానని తెలిపారు.

మరోపక్క రెండ్రోజుల పోలీస్‌ కస్టడీ ముగియడంతో నిందితుడు బడుగు నాగేశ్వరరావును శుక్రవారం సాయంత్రం వైద్య పరీక్షలనంతరం మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. మంత్రిని హతమార్చేందుకే తాను వెళ్లానని, ఇందుకు తనను ఎవరూ పురిగొల్పలేదని విచారణలో నిందితుడు బదులిచ్చినట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి.