ఏటీఎం చోరీ.. చివర్లో దొంగకు దిమ్మతిరిగింది.. వీడియో వైరల్ !

Thu Jun 17 2021 22:00:01 GMT+0530 (IST)

Huge Shock To Atm Theif In Khammam

ఖమ్మం జిల్లాలో దుండగులు ఓ ఏటీఎంను కొల్లగొట్టేందుకు ప్రయత్నించి చివరికి ఏమీ తెలియనట్టు అక్కడి నుండి జారుకున్నారు. అంతేకాదు వారు ఆ పని చేసే క్రమం నవ్వు తెప్పిస్తోంది. ఖమ్మం జిల్లా మధిర పట్ణణంలోని ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలోని డబ్బును కాజేసేందుకు ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు. కాసేపటికే తేలు కుట్టిన దొంగల్లా ఏమీ తెలియనట్లు బయటికి జారుకున్నారు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే ... మధిర బస్టాండ్ సమీపంలోని మెయిన్ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఆ ఏటీఎం ఉంది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే ఇద్దరు దొంగలు మాస్కులు ధరించి ఏటీఎంను కొల్లగొట్టేందుకు వచ్చారు. వారితోపాటు వెంట గడ్డపార వంటి ఆయుధాలు తెచ్చుకున్నారు. ఇద్దరు దొంగలు ఏటీఎంలోకి చొరబడి ముందస్తు జాగ్రత్తగా అందులో ఉన్న సీసీటీవీ కెమెరాను పొడుగాటి రాడ్ తో ధ్వంసం చేసేశాడు. ఇక తమను ఎవరూ చూడడం లేదనుకొని ధైర్యంగా ఏటీఎంను కొల్లగొట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. పలుగుతో ఏటీఎంను కొల్లగొట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇంతలో దుండగుడి కన్ను ఏటీఎం గదిలోనే ఓ మూలపై పడింది. దీంతో అతను వెంటనే కంగుతిని నిరుత్సాహపడిపోయాడు.

ఎందుకంటే అక్కడ మరో సీసీటీవీ కెమెరా ఉంది. అప్పటిదాకా ఏటీఎంను కొల్లగొట్టేందుకు వారు చేసిన తతంగమంతా ఆ కెమెరాలో రికార్డయింది. దీంతో చేసేది లేక ఏటీఎం కొల్లగొట్టడం విరమించుకొని ఏమీ తెలియనట్లు బయటకు వచ్చేశారు. ఈ విషయం ఏటీఎం నిర్వహకులకు తెలియడంతో వారు ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ కోసం సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. దొంగలు చేసిన విన్యాసాలన్నీ బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.