Begin typing your search above and press return to search.

బడంగ్‌ పేటలో బీజేపీ కి భారీ షాక్ .. చక్రం తిప్పిన మంత్రి సబిత !

By:  Tupaki Desk   |   27 Jan 2020 7:00 AM GMT
బడంగ్‌ పేటలో బీజేపీ కి భారీ షాక్ ..  చక్రం తిప్పిన మంత్రి సబిత !
X
రాజకీయాలలో కొనసాగాలి అంటే ప్రత్యర్థులు ఒక వ్యూహాన్ని ఆలోచించే సమయానికే, వ్యూహం అమలుచేయాలి. లేకపోతే రాజకీయాలలో కొనసాగడం చాలా కష్టం. ఇది ఇప్పటికే ఎన్నో సందర్భాల లో నిరూపితమైంది. ఇకపోతే తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో కూడా ప్రత్యర్థుల వ్యూహం కంటే ముందే వ్యహం పన్ని , అమలు చేయడంతో టిఆర్ ఎస్ ఖాతాలోకి మరో కార్పొరేషన్‌ వచ్చి చేరబోతోంది. అసలు విషయం ఏమిటంటే ? మంత్రి సబితా ఇంద్రారెడ్డి... తన సొంత నియోజక వర్గంలో ఎవరి ఊహకూ అందనంత వేగంగా పావులు కదిపి తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత బడంగ్ పేట్ లో హంగ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే. ఏ పార్టీ కి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ కార్పొరేషన్లో టీఆర్ ఎస్ 13 సీట్లు గెలవ గా.. కాంగ్రెస్ ఏడు చోట్ల, బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించాయి. దీనితో ప్రతి ఒక్కరూ కూడా తమ తమ వ్యూహాలని అమలు చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూసారు. ముఖ్యంగా రెండో స్థానంలో నిలిచిన బీజేపీ , కాంగ్రెస్ తో చేతులు కలిపి మేయర్ పీఠం పై కూర్చోవాలి అని అనుకున్నది. ఇందులో భాగంగా ఇద్దరు ఇండిపెండెంట్లను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నించింది. ఇక్కడ టీఆర్ ఎస్ కు ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. బీజేపీకి చెక్ పెట్టడం కోసం, ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగంలోకి దిగారు. బీజేపీ పై ఉండే ప్రతీకారం తీర్చుకోవడానికి , కాంగ్రెస్ నేతల తో తనకి ఉన్న పాత పరిచయాలని ఉపయోగించుకొని , పలువురు కాంగ్రెస్ సబ్యులని పార్టీలోకి ఆహ్వానించింది.

కాంగ్రెస్ నేత, మాజీ వైస్‌ చైర్మన్‌ చిగిరింత నర్సింహారెడ్డితో సబిత సంప్రదింపులు జరిపారు. 31వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన ఆయన భార్య పారిజాతా రెడ్డి కి మేయర్‌ పదవి ఆఫర్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ కు కూడా చేరవేశారు. దీనికి మంత్రి కేటీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. పారిజాతారెడ్డి ఆదివారం టీఆర్ ఎస్ లో చేరారు. ఈ వ్యవహారంలో మంత్రి కుమారుడు కార్తీక్‌ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరించారు. ఆమెతో పాటుగా కాంగ్రెస్‌ మండల కమిటీ అధ్యక్షుడు మర్రి హన్మంత్‌రెడ్డి, బీ బ్లాక్‌ మా జీ ఉపాధ్యక్షుడు కళ్లెం నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ కటిక రెడ్డి శ్రీరాం రెడ్డి తదితరులు సైతం టీఆర్‌ ఎస్ గూటికి చేరారు. దాంతో బడంగ్‌పేట్‌ మేయర్‌ పదవిపై నెలకొన్న డైలమాకు తెర పడినట్టయింది. మొత్తంమీద హంగ్‌ వచ్చిన బడంగ్‌ పేట్‌ లోనూ చివరకు గులాబీ జెండా ఎగరబోతోంది.