Begin typing your search above and press return to search.

కోట్లు కురిపిస్తున్న కేసీఆర్ ఐడియా!

By:  Tupaki Desk   |   28 Sep 2020 7:50 AM GMT
కోట్లు కురిపిస్తున్న కేసీఆర్ ఐడియా!
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లే ఔట్లు.. ప్లాట్ల క్రమబద్దీకరణ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన తెలంగాణ సర్కారు కారణంగా ఎల్ఆర్ఎస్ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. భూయజమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 5.15లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయితీలు మొదలు మున్సిపాల్టీలు.. కార్పొరేషన్లు ఇలా అన్ని వైపుల నుంచి అప్లికేషన్ల జోరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అప్లికేషన్ మొత్తాన్ని కేవలం వెయ్యికే పరిమితం చేశారు. ఇలా చేస్తేనే.. ప్రభుత్వానికి 52 కోట్ల మేర ఆదాయం లభించటం గమనార్హం. ఆదివారం రాత్రి నాటికి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల రూపం లో రూ.52.37కోట్ల మొత్తం వచ్చినట్లు గా తెలుస్తోంది. అక్రమ వెంచర్ల లో ప్లాట్లు కొన్న యజమానులు భారీ ఎత్తున దరఖాస్తు చేసుకున్నట్లు గా చెబుతున్నారు.

మరో కీలక అంశం ఏమంటే..పట్టణాలకు ధీటుగా గ్రామ పంచాయితీల పరిధిలో సైతం అప్లికేషన్లు జోరుగా వస్తున్నాయి. అనధికార లే-అవుట్లు.. ప్లాట్ల క్రమబద్దీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేయటంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో అప్లికేషన్లు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ గడువు అక్టోబరు 15 తో ముగియనుంది. మొదట్లోనే ఇంత జోరు ఉంటే.. చివరకు వచ్చే సరికి మరింత పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఒక అంచనా ప్రకారం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను ఓకే చేస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ఫీజుల రూపంలోనే రూ.10వేల కోట్ల మేర ఆదాయం లభించే అవకాశం ఉందంటున్నారు. ఈ భారీ మొత్తం కచ్ఛితంగా రాష్ట్రానికి ఉన్న ఆర్థిక సమస్యల్ని కొంతమేర పరిష్కరించటం ఖాయమని చెప్పక తప్పదు.