కరోనా బాధితులకు ఎంత ఆక్సిజన్ అవసరం.. ఎవరిలో ఎలా ఉంటుంది?

Tue May 04 2021 09:00:02 GMT+0530 (IST)

How much oxygen do corona sufferers need

కరోనా మహమ్మారి రెండో దశ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగుతూనే ఉంది. సెకండ్ వేవ్ వైరస్ తో మరణించే వారిలో ఎక్కువ మంది ఆక్సిజన్ అందకనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరి ఆడక తనువు చాలిస్తున్నారు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వల్ల ఇలా జరుగుతోందని వైద్యులు తెలిపారు. అయితే కరోనా బాధితులందరికీ కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.కొవిడ్ బాధితుల్లో 90 శాతం కన్నా తక్కువగా ఆక్సిజన్ స్థాయి ఉంటే వారు వైద్యులను సంప్రదించాలి. సహజంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారికి కృత్రిమంగా అందిస్తారు. అయితే ఈ స్థాయిలు ఒక్కొక్కరిలో ఒక్కో మాదిరి ఉంటాయని నిపుణులు అంటున్నారు. కృత్రిమ శ్వాస అవసరం ఉన్నవారు కేవలం పది శాతం మాత్రమేనని చెబుతున్నారు. ఒక మనిషి నిమిషానికి 7-8 లీటర్ల గాలిని పీల్చుతారు. అంటే రోజులో దాదాపు 11 వేల లీటర్ల గాలిని శ్వాసిస్తారు. ఇందులో గాలి 21శాతం గాలిని పీల్చి... 15 శాతం మళ్లీ బయటకు వదులుతారు. ఆరోగ్యవంతమైన మానవుడిలో శ్వాసక్రియా ఇలా జరుగుతుంది. ఇతర సమస్యలు ఉన్నవారిలో ఈ శాతం కాస్త భిన్నంగా ఉంటుంది.

 కరోనా వైరస్ మొదటగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా శరీరానికి అవసరమైన ప్రాణ వాయువు అందడం లేదు. ఫలితంగా ప్రాణాలు పోతున్నాయి. కొందరికి 3600 లీటర్ల ఆక్సిజన్ అవసరం కాగా మరికొందరికి 86 వేల లీటర్లు అవసరం అవుతుందని చెబుతున్నారు. ఈ తరుణంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు డిమాండ్ అధికమైంది. హోం ఐసోలేషన్ లో ఉన్న బాధితులకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇది స్వల్ప పరిమాణంలోనే అందించగలవు.

ఆక్సిజన్ లెవెల్స్ ను ఇంట్లోనే పరీక్షించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఆరు నిమిషాల నడకతో తెలుసుకోవచ్చని సూచించారు. తొలుత నడక మొదలుపెట్టే ముందు ఆక్సిమీటర్ తో పరీక్షించుకొని... నడక పూర్తయ్యాక మళ్లీ టెస్ట్ చేయాలి. ఈ రెండు సార్లు నమోదైన శాతాల్లో తేడాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. మూడు శాతం కంటే ఎక్కువగా తేడా ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని హెచ్చరిస్తున్నారు.