Begin typing your search above and press return to search.

షాకింగ్ లేఖ బయటకు.. హైదరాబాద్ మెట్రోకు రోజుకు ఎంత నష్టమంటే?

By:  Tupaki Desk   |   25 Nov 2021 5:32 AM GMT
షాకింగ్ లేఖ బయటకు.. హైదరాబాద్ మెట్రోకు రోజుకు ఎంత నష్టమంటే?
X
దేశంలోనే రెండో అతి పెద్ద మెట్రో ప్రాజెక్టు. ప్రపంచంలోనే మరెక్కడా లేని రీతిలో కేవలం ఒంటి స్తంభాల మీద మెట్రో రైలును పరుగులు తీయించిన విలక్షణ డిజైన్ హైదరాబాద్ మెట్రో రైల్ సొంతం. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తీర్చి దిద్దిన హైదరాబాద్ మెట్రో తీవ్ర నష్టాలతో కిందా మీదా పడుతోంది.

ఈ విషయానికి సంబంధించిన వార్తలు గతంలో కొన్ని వచ్చినా.. ఆధారాలతో సహా బయటకు వచ్చింది లేదు. ప్రభుత్వ.. ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైల్ లో మేజర్ షేర్ ప్రఖ్యాత ఎల్ అండ్ టీ సంస్థది.

తాజాగా తమకు రోజువారీగా ఎదురవుతున్న నష్టాలకు సంబంధించిన ఎల్ అండ్ టీ మెట్రో రైల్ కు చెందిన కీలక అధికారి ఒకరు తెలంగాణ రాష్ట్రచీప్ సెక్రటరీకి రాసిన లేఖ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో హైదరాబాద్ మెట్రోకారణంగా తాము ఎదుర్కొంటున్న నష్టాల గురించి వెల్లడించటమే కాదు.. దాని తీవ్రత ఎంతన్న విషయాన్ని వెల్లడించిన షాకిచ్చారు.

ఈ భారీ పీపీపీ ప్రాజెక్టు ఇప్పుడు నష్టాల ఊబిలో కూరుకుపోతున్న వేళ.. ఉపశమనం కోసం తమకు ఆర్థిక ప్యాకేజీని విడుదల చేయాలని కోరుతూ లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.

బయటకు వచ్చిన ఈ లేఖ మీద ఎల్ అండ్ టీ వర్గాలు పెదవి విప్పటం లేదు. కరోనా కారణంగా నష్టాలు మరింత పెరగటంతో.. ఇంతకాలం ఏదో ఒకరోజున లాభాలు వస్తాయన్న ఆశ అడుగంటినట్లుగా కనిపిస్తోంది.

ఇంతకీ ఈ లేఖలో ఉన్న అంశాల్ని చూస్తే.. ఈ సెప్టెంబరు 14న ముఖ్యమంత్రితో సహా ఎల్ అండ్ టీ ఉన్నతాధికారులతో సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘మా సమస్యలన్ని చెప్పాం. వాటిల్లో పలు అంశాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి మూడు నాలుగు రోజుల్లో తగిన ఉపశమన చర్యలు సూచించాల్సిందిగా ఆదేశించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంస్థను బయటపడేసేందుకు ఏం చేయొచ్చో కూడా సూచన చేయాలని చెప్పారు’’ అని గుర్తు చేశారు.

ఇదంతా జరిగిన వారాలు గడుస్తున్నా.. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి డెవలప్ మెంట్ లేదన్నారు. ఈ సందర్భంగా తమకు రోజువారీగా వస్తున్న నష్టాల లెక్కను ప్రస్తావిస్తూ.. ‘‘ప్రతి రోజూ రూ.5 కోట్ల రూపాయిల నష్టాల్ని చవిచూస్తున్నాం. సెప్టెంబరు 30తోముగిసిన త్రైమాసికంలో రూ.455 కోట్ల నష్టాల్ని చవిచూశాం. ఈ భారం రోజురోజుకు పెరుగుతూనే ఉంది’’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

తాము ఎంతలా ప్రయత్నిస్తున్నా.. నష్టాల నుంచి బయటపడలేదని పేర్కొంది. ఈ సంస్థ నిర్వహణ విషయంలో తమ మాత్రసంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు కూడా ఆందోళనలో ఉన్నట్లుగా పేర్కొంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి.. తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఈ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ధాన్యం కొనుగోలు విషయంలో తాము కేంద్రానికి సమాచారం ఇచ్చి వచ్చిన తర్వాత స్పందించింది లేదని.. నిర్ణయం తీసుకున్నది లేదంటూ విమర్శలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ ప్రభుత్వానికి వచ్చిన వినతుల విషయంలోనూ సేమ్ టుసేమ్ అన్నట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయాల్లో గొప్పగా చెప్పుకునే హైదరాబాద్ మెట్రో రైల్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని కేసీఆర్ సర్కారు ఇంత లైట్ తీసుకోవటం దేనికి నిదర్శనం?