Begin typing your search above and press return to search.

ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు ?

By:  Tupaki Desk   |   24 Jan 2021 10:30 AM GMT
ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు ?
X
పంచాయితి ఎన్నికల నిర్వహణకు ఎవరు సహకరించకపోయినా, ఎవరు ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందులు కలిగించినా వారిని ఉపేక్షించేది లేదు అని స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు. నిజానికి ఎలక్షన్ విధుల్లో ఉన్నవారంతా నిమ్మగడ్డ ఆదేశాలకు లోబడే పనిచేయాల్సుంటుంది. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమీషన్ దే అంతిమ నిర్ణయం అనటంలో సందేహం కూడా లేదు. కానీ ఇక్కడ ప్రత్యేక పరిస్దితుల కారణంగా అంతా గందరగోళమైపోయింది.

తన బాధ్యతలను, విధులను నిర్వర్తించటంలో నిమ్మగడ్డ ఫెయిలయ్యారన్నది వాస్తవం. ఎందుకంటే ఇఫుడు జరగబోతున్న ఎన్నికలు జరగాల్సింది 2018 జూలై-ఆగష్టులో. స్ధానిక సంస్ధల ఎన్నికలను సకాలంలో నిర్వహించాల్సిన బాధ్యత, అధికారాలు కమీషన్ కు ఉందని చెప్పారు. మరి తన బాధ్యతను, అధికారాలను 2018లో ఎందుకు ఉపయోగంచలేదు ? మూడు మాసాల్లోనే ఎన్నికలు నిర్వహించాలంటూ 2018 ఆగష్టులోనే హైకోర్టు చెప్పినా నిమ్మగడ్డ ఎందుకని ఎన్నికలు నిర్వహించలేదు ?

అంటే అప్పట్లో కారణాలు ఏవైనా నిమ్మగడ్డ తన బాధ్యతలు నిర్వర్తించటంలో విఫలమైనట్లే లెక్క. మరి అప్పట్లో విధినిర్వహణలో ఫెయిలైన నిమ్మగడ్డ ఇప్పుడు మాత్రం ఎందుకని బాధ్యతలను, అధికారాలను పదే పదే ఉపయోగించాలని అనుకుంటున్నారు ? ఇక్కడే నిమ్మగడ్డకు ప్రభుత్వానికి సమస్య మొదలైంది. జగన్మోహన్ రెడ్డిని గుర్తించటానికి నిమ్మగడ్డ ఇష్టపడనట్లే నిమ్మగడ్డను గుర్తించటానికి జగన్ కూడా ఇష్టపడలేదన్నది చాలా సింపుల్. మొత్తానికి వీళ్ళిద్దరు బాగానే ఉంటారు కానీ మధ్యలో నలిగిపోయేది మాత్రం ఉద్యోగులే.

తన ఆదేశాలను పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిందే అని నిమ్మగడ్డ చాలా పంతంతో ఉన్నారు. మరి ఎంతమంది ఉద్యోగులపై నిమ్మగడ్డ యాక్షన్ తీసుకోగలరు ? ఎన్నికల విధులకు హాజరవ్వటానికి చాలామంది ఉద్యోగులు ఇష్టపడటం లేదు. ఇందులో రెవిన్యు, పంచాయితీరాజ్, పోలీసుల శాఖల్లోని ఉద్యోగులున్నారు. క్షేత్రస్ధాయిలో పనిచేయటానికి ఇష్టపడని వీళ్ళందరిపైనా నిమ్మగడ్డ యాక్షన్ తీసుకోగలరా ? ఎట్టి పరిస్దితుల్లోను తాము ఎన్నికల డ్యూటి చేసేది లేదని ఉద్యోగులు తెగేసిచెబుతున్నారు. సస్పెండ్ చేస్తే చేసుకోమంటున్నారు.

ఒకవేళ నిమ్మగడ్డ యాక్షన్ తీసుకోవాలని అనుకున్నా దాన్ని ఆచరించాల్సింది మళ్ళీ ప్రభుత్వమే. కొన్ని వేలమంది ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాల్సుంటుంది. అందుకు నిరాకరించిన వాళ్ళందరిపైనా యాక్షన్ తీసుకోవటం ఎవరి వల్లా కాదు. కరోనా వైరస్ కారణంగా తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని చెబుతున్న ఉద్యోగుల వాదనలో కూడా అర్ధముంది కదా. మరి దాన్నెందుకు నిమ్మగడ్డ పట్టించుకోటం లేదు. మీడియా సమావేశంలోనే కరోనా వైరస్ పరంగా అన్నీ జాగ్రత్తలు తీసుకున్న నిమ్మగడ్డ ఉద్యోగులు, జనాల గురించి మాత్రం ఎందుకు ఆలోచించటం లేదు.