Begin typing your search above and press return to search.

ఈ పాచిపోయిన మాటను ఎన్నిసార్లు చెబుతారు చంద్రబాబు?

By:  Tupaki Desk   |   18 Aug 2022 4:49 AM GMT
ఈ పాచిపోయిన మాటను ఎన్నిసార్లు చెబుతారు చంద్రబాబు?
X
కొన్ని మాటల్ని చాలా తక్కువ సందర్భాల్లో చెబితే అందంగా ఉంటుంది. అదే పనిగా చెప్పటం వల్ల ప్రయోజనం శూన్యం. అంతేకాదు.. సీరియస్ నెస్ కూడా తగ్గిపోతుంది. ఈ చిన్న విషయాల్ని చంద్రబాబు ఎందుకు మిస్ అవుతారో అర్థం కాదు. ఎవరెన్ని చెప్పినా ఏపీలో సార్వత్రిక ఎన్నికలు 2024 మే ముందు జరిగే అవకాశమే లేదు.

అలాంటప్పుడు ఈ మాత్రం దానికే.. త్వరలో ఎన్నికలు రానున్నట్లుగా కొన్నిసార్లు.. అప్పుడప్పుడు ఎన్నికలకు తగిన సమయం లేదని.. మరింత అలెర్ట్ కావాలని.. దూకుడు పెంచాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసే వ్యాఖ్యలు నవ్వు పుట్టించేలా చేస్తుంటాయి.

తాజాగా ఆయన నోటి నుంచి ఇదే తరహాలో వ్యాఖ్యలు వినిపించాయి. రాష్ట్రంలో ఎన్నికలకు ఎక్కువ టైం లేదని.. పార్టీ నేతలు.. ఇన్ ఛార్జులు మరింత దూకుడు పెంచాలంటూ దిశా నిర్దేశం చేశారు. రానున్న ఏడాది అత్యంత కీలకమన్న ఆయన.. అలసత్వం వీడి పక్కా ప్రణాళికతో పని చేయాలన్నారు. తాజాగా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జిలను సమీక్ష నిర్వహిస్తున్న ఆయన.. తొలిరోజు అవనిగడ్డ.. పెనమలూరు.. మార్కాపురం.. సంతనూతలపాడు ఇన్ ఛార్జిలతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఏమేం చేయాలన్న అంశాలతో పాటు.. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయటం కోసం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన దిశానిర్దేశం చేశారు. తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా మాట్లాడిన చంద్రబాబు.. జగన్ సర్కారు వైఫల్యాలపై వారి ఎదుట ఏకరువు పెట్టి..

మరింత గట్టిగా పని చేయాలని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఎన్నికలకు అట్టే టైం లేదు.. మరింత దూకుడు పెంచాలని చెప్పే చంద్రబాబు మాటలు పాచిమాటలుగా మారాయి. ఇదే మాటను ఆయన నోటి నుంచి తరచూ వస్తున్నది.

నిజానికి ఈ మాటలు చెప్పటాని కంటే కూడా.. పార్టీకి సంబంధించి నియోజకవర్గాల వారీగా అత్యధిక సంఖ్యలో అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించటం ద్వారా.. పార్టీలో మరింత జోష్ పెంచే వీలుంది. ఇలాంటి ప్రయత్నాల్ని వదిలేసి.. ఎన్నికలు వస్తున్నాయి.. టైం లేదు.. దూకుడు పెంచమని చెప్పే చంద్రబాబు మాటలతో పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. దీనికి బదులు కీలక నిర్ణయాలు తీసుకుంటే పార్టీలో బాబు అనుకున్నంత జోష్ నింపే వీలుందన్న మాట వినిపిస్తోంది.