Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో వ్యాక్సినేషన్ ఎలా ?

By:  Tupaki Desk   |   12 May 2021 11:33 AM GMT
లాక్ డౌన్ లో వ్యాక్సినేషన్ ఎలా ?
X
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రతను నియంత్రించటంలో భాగంగా తెలంగాణా ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుండి నాలుగు గంటలపాటు అంటే 10 గంటల వరకే జనసంచారానికి వెసులుబాటు ఇచ్చింది. మిగిలిన సమయంలో వైద్య, ఆరోగ్యం, మీడియా, అత్యవసరాలకు మినహాయింపులిచ్చింది. ఇదంతా బాగానే ఉంది కానీ మరి వ్యాక్సినేషన్ సంగతేమిటి ?

గడచిన పదిరోజులుగా కోవిడ్ టీకాల కోసం జనాలు ప్రైమరీ హెల్త్ సెంటర్లు, వ్యాక్సినేషన్ కేందాల ముందు పెద్దఎత్తున క్యూలు కడుతున్నారు. వ్యాక్సినేషన్ కోసం జనాలు ఒక్కో కేంద్రం వద్ద 300 మంది క్యూ కడుతుంటే వేస్తున్న టీకాలేమో 60 మందికి వేస్తే చాలా ఎక్కువ. టీకాల సరఫరాలో తలెత్తిన తీవ్రమైన కొరత వల్లే అందరికీ టీకాలను తెలంగాణా ప్రభుత్వం వేయలేకపోతున్నది.

డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవటంతోనే ప్రభుత్వం టీకాల విషయంలో చేతులెత్తేసింది. అందుకనే మధ్యే మార్గంగా టీకాలు వేయటంలో రెండో డోసు వేయించుకోవాల్సిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ కేంద్రాలకు రావాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. మొదటి డోసు వేయించుకోవాల్సిన వారికి తాత్కాలికంగా టీకాలు వేయటంలేదని కూడా స్పష్టంచేసింది. అయినా సరే మొదటిడోసుకు+రెండో డోసు వేయించుకునేందుకు జనాలు కేంద్రాలకు వచ్చేస్తున్నారు.

ఇలాంటి నేపధ్యంలోనే ప్రభుత్వం హఠాత్తుగా 10 రోజుల లాక్ డౌన్ విధించింది. మార్గదర్శకాల్లో అనేక విషయాలను ప్రస్తావించిన ప్రభుత్వం మరి వ్యాక్సినేషన్ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. టీకాలు వేయించుకోవాల్సిన జనాలు వ్యాక్సినేషన్ కేంద్రాలకు చేరుకోవాలంటే ఎలా రావాలి ? అన్నదే ఇపుడు ప్రశ్న. ఒకవైపు టీకాలు వేయించుకునేందుకు స్లాట్ బుక చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో స్లాట్ తో సంబంధంలేకుండా మొదటిడోసు వేయించుకున్నట్లు వ్యాక్సినేషన్ కేంద్రాలకు నేరుగావచ్చి సర్టిఫికేట్ చూపించినా రెండోడోసు వేస్తామని ప్రభుత్వమే ప్రకటించింది. మరి ఇపుడు రెండు పద్దతుల్లోను రెండో డోసు వేయించుకోవాల్సిన వాళ్ళ సంగతేమిటి ? అన్నది అయోమయంగా తయారైంది. కరోనా చికిత్సలు కంటిన్యు అవుతాయని సింపిల్ గా ప్రభుత్వం తేల్చేసింది. మరి చివరకు ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.