Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్‌ పై విదేశాల్లో అలా.. మోదీ ఇలా.. ప్ర‌జ‌లు న‌మ్మేదెలా?

By:  Tupaki Desk   |   16 Jan 2021 10:32 AM GMT
వ్యాక్సిన్‌ పై విదేశాల్లో అలా.. మోదీ ఇలా.. ప్ర‌జ‌లు న‌మ్మేదెలా?
X
క‌రోనా నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు.. ఈ దేశ చ‌రిత్ర‌లో ఎవ‌రూ ఎన్న‌డూ చేయ‌ని విధంగా తాము.. అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌ని.. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చా మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సిన్ లు.. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ల‌ను అందిం చే కార్య‌క్ర‌మానికి మోడీ శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తొలి ప్రాధాన్యం క‌రోనా వారియ‌ర్స్‌కేన‌ని ప్ర‌క‌టించారు. కానీ, ఇదే ప్ర‌క్రియ విదేశాల్లోనూ జ‌రిగింది.. జ‌రుగుతోంది. కానీ, అక్క‌డి పాల‌కులు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. క‌రోనా వ్యాక్సిన్‌ను ముందుగా వారే తీసుకున్నారు.

ఎందుకంటే.. క‌రోనాపై ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌యం ఇంకా పోలేదు. పైగా ఇది రెండో రూపం సంత‌రించుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకుని త‌గ్గించుకోవాల‌ని అనుకున్నా.. వ్యాక్సిన్‌పై అనేక వ్య‌తిరేక‌క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకుంటే.. న‌పుంస‌కులు అవుతార‌ని.. మ‌హిళ‌లైతే.. గ‌ర్భం దాల్చే శ‌క్తి సామ‌ర్థ్యాలు త‌గ్గిపోతాయ‌ని.. న‌రాల బ‌ల‌హీనత వ‌స్తుంద‌ని... కేన్స‌ర్‌కు సైతం దారితీసే ప‌రిస్థితిని కొట్టిపారేయ‌లేమ‌ని.. అనేక అధ్య‌నాల్లో తేలుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిస్థితిలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు చాలా మంది వెన‌క్కి త‌గ్గుతున్నారు.

ఈ ప‌రిస్థితి ఒక్క మ‌న‌దేశంలోనే కాదు.. ఇత‌ర దేశాల్లోనూ వెలుగు చూసింది. అలాంటి స‌మ‌యాల్లో ఆయా దేశాల‌ను పాలిస్తున్న నాయ‌కులు.. ప్ర‌జ‌ల్లో మ‌నోధైర్యం క‌ల్పించేందుకు.. ``ముందు మేం!`` నినాదంతో ముందుకు సాగారు. తొలి టీకాను వారేవేయించుకుని రికార్డు సృస్టించారు. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్‌, అమెరికా కాబోయే అధ్య‌క్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు.. క‌మ‌లా హ్యారిస్‌.. గ‌ల్ఫ్ దేశాధినేతలు సైతం ముందుగా తామే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ త‌ర్వాతే ప్ర‌జ‌లకు ఇచ్చారు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల్లో ఉన్న అపోహ‌ల‌ను తొల‌గించే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ, మ‌న ద‌గ్గ‌ర మాత్రం అలాంటి ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించినా.. 130 కోట్ల మంది భిన్న‌మైన అభిప్రాయ‌లు.. ప‌ద్ద‌తులు ఉన్న దేశంలో ప్ర‌జ‌ల్లో నెలకొన్న అపోహ‌ల‌ను తొల‌గించే విధానం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దేశాధినేత‌లు గా ఉన్న‌రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, లోక్‌స‌భ స్పీక‌ర్‌, మంత్రులు .. ఇలా దాదాపు మోడీ కేబినెట్‌లో ఏ ఒక్క‌రూ వ్యాక్సిన్ కోసం ముందుకు రాలేదు.

ఇక‌, బీజేపీ నాయ‌కులు కూడా దూరంగానే ఉన్నారు. ఇదొక బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మ‌మ‌ని.. దీనిని ప్రారంభించ‌డం దేశానికే గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప‌దేప‌దే చెప్పిన ప్ర‌ధాని.. తొలి టీకా తాను కానీ, త‌న కేబినెట్ మంత్రుల‌కు కానీ తీసుకునేందుకు సాహ‌సం చేయ‌లేదు. అంటే.. వ్యాక్సిన్ వ‌ల్ల ఏవైనా దుష్ప‌రిణామాలు త‌లెత్తితే.. తాము మాత్రం సేఫ్‌గా ఉండాల‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.