Begin typing your search above and press return to search.

ఐఎస్ బీ హైదరాబాద్ కు ఎలా వచ్చింది? తెలుగోళ్లకు ఎంతమందికి తెలుసు?

By:  Tupaki Desk   |   25 May 2022 3:28 AM GMT
ఐఎస్ బీ హైదరాబాద్ కు ఎలా వచ్చింది? తెలుగోళ్లకు ఎంతమందికి తెలుసు?
X
ఐఎస్ బీ.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బీ (బిజినెస్) స్కూల్. ఇందులో కోర్సు చేశారంటే చాలు.. తన్నుకుంటూ ఉద్యోగం రావటమే కాదు.. కళ్లు చెదిరే ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేస్తుంటారు. ఇవాల్టి రోజున హైదరాబాద్ కీర్తి కిరీటంలో ఐఎస్ బీ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ.. ఆ బీ స్కూల్ హైదరాబాద్ కు ఎలా వచ్చిందన్న అసలు విషయం తెలుగువారిలో చాలామందికి తెలీదు.

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అవసరం ఉన్నా లేకున్నా.. చంద్రబాబును తిట్టిపోసే చాలామందికి కూడా హైదరాబాద్ కు ఐఎస్ బీ ఎలా వచ్చిందన్న విషయం గురించి తెలియని పరిస్థితి. మరో రోజులో (మే 26న) ఐఎస్ బీని ఏర్పాటు చేసి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. ఈ విద్యా సంస్థ సాత్నకోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. ఇలాంటివేళ.. ఐఎస్ బీ హైదరాబాద్ కు ఎలా వచ్చిందన్న విషయాన్ని ఇప్పటికైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

దేశంలోని టాప్ పారిశ్రామికవేత్తలంతా కలిసి.. దేశంలోనే అత్యుత్తమ బిజినెస్ స్కూల్ పెట్టాలని.. నాణ్యమైన మానవ వనరుల ఉత్పత్తి కేంద్రంగా దాన్ని తయారు చేయాలని భావించారు. ఇందులో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. ఆ రోజుల్లో వారు బెంగళూరులో ఈ విద్యా సంస్థను ప్రారంభించాలని భావించారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేయటమే కాదు.. నాటి కర్ణాటక ముఖ్యమంత్రి పాటిల్ ను కలిసి.. తమ నిర్ణయాన్ని తెలపాలని నిర్ణయించారు. ఇందుకోసం అపాయింట్ మెంట్ తీసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ పారిశ్రామిక దిగ్గజాలను హైదరాబాద్ కు బ్రేక్ ఫాస్ట్ కు రావాలని కోరారు. మీరు కోరుకున్నట్లుగా బెంగళూరులోనే ఐఎస్ బీని పెట్టండి.. కానీ ఆ వెళ్లేటప్పుడు హైదరాబాద్ కు వచ్చి బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్లాలని కోరారు. అందుకు పారిశ్రామికవేత్త పెద్ద ఆసక్తి చూపించలేదు. ఆ టైంలో టీవీ9 డైరెక్టర్ లో ఒకరైన శీనిరాజును సంప్రదించిన చంద్రబాబు.. పారిశ్రామికవేత్తల్ని హైదరాబాద్ కు వచ్చేలా చూడాలని కోరారు.

అప్పట్లో ఏపీ సీఎంగా.. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు ఇమేజ్ .. అదే పనిగా బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని అడుగుతున్న వేళలో.. కాదనలేక వస్తామని చెప్పాలి. చెప్పినట్లే.. అందరూ హైదరాబాద్ కు బ్రేక్ ఫాస్ట్ కు వచ్చారు. వారందరిని కొసరికొసరి వడ్డించి.. వారు స్టార్ట్ చేయబోయే విద్యా సంస్థ గురించి వివరాలు అడిగారే తప్పించి.. హైదరాబాద్ లో పెట్టాలని చెప్పి వారిని ఇబ్బందికి గురి చేయలేదు. బ్రేక్ ఫాస్ట్ ముగిసిన తర్వాత.. వారంతా ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు తమ కార్ల వద్దకు వెళ్లగా.. చంద్రబాబు స్వయంగా ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త కారు వద్దకు వెళ్లి.. వ్యక్తిగతంగా వారికి వీడ్కోలు పలికారు.

కట్ చేస్తే.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిన సదరు పారిశ్రామికవేత్తలు.. తమకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన టైంకు వెళ్లారు. కానీ.. వేరు పనుల్లో బిజీగా ఉన్న ఆయన.. సదరు పారిశ్రామికవేత్తలందరిని దాదాపు మూడు గంటల పాటు వెయిట్ చేయించారు. దీంతో.. వారంతా ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకొని.. శీనిరాజుకు ఫోన్ చేసి.. మేం బెంగళూరులో పెట్టాలనుకున్న బిజినెస్ స్కూల్ ను హైదరాబాద్ లో పెట్టాలనుకుంటున్నాం.. మా నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేయండన్నారు. రాలేమని చెప్పిన బ్రేక్ ఫాస్ట్ కు రప్పించి.. వారికి అతిధి మర్యాదలు చేయటం ద్వారా మనసు దోచుకున్న చంద్రబాబు.. హైదరాబాద్ మణిహారంలో ఒక మణి లాంటి ఐఎస్ బీని తీసుకొచ్చారు.

విజన్ ఉన్న నేత ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే ఏం జరుగుతుందన్న విషయం ఐఎస్ బీ చరిత్రలోకి వెళితే తెలుస్తోంది. ఇదంతా చెప్పి చంద్రబాబు భజన చేయటం మా ఉద్దేశం కాదు. జరిగిన వాస్తవాన్ని ఇప్పటివారికే కాదు.. భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలా అని చంద్రబాబు తన పాలనలో తప్పులు చేయలేదని చెప్పట్లేదు. ఐఎస్ బీ హైదరాబాద్ కు రావటంతో ఆయన పోషించిన పాత్రను ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే ఇక్కడి ఉద్దేశం.