Begin typing your search above and press return to search.

కరోనాతో భారత్ మీద దెబ్బ ఎంతో తెలిస్తే గుండెలు అదురు

By:  Tupaki Desk   |   4 April 2020 4:30 AM GMT
కరోనాతో భారత్ మీద దెబ్బ ఎంతో తెలిస్తే గుండెలు అదురు
X
కరోనా కారణంగా నష్టమెంత? అన్న ప్రశ్న వేసినంతనే.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తమకు జరిగిన నష్టాన్ని ఎకరువు పెడతారు. మరి.. ఇలా ఎవరికి వారికి నష్టం ఇంతలా ఉంటే.. ఒక దేశానికి మరెంత నష్టం వాటిల్లుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనాతో చోటు చేసుకున్న నష్ట తీవ్రత ఎక్కువగా ఉండటమే కాదు.. ఊహించిన దాని కంటే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా ప్రభావం దేశం మీద పడినప్పుడు వేసిన అంచనాలు తాజాగా మారిపోతున్నాయి.

ఊహించిన దాని కంటే ఎక్కువగా నష్ట తీవ్రత ఉందని చెబుతున్నారు. మొన్నటి వరకూ దేశ వృద్ధి రేటు అంచనాల్ని 5.6 నుంచి 5.1 శాతానికి తగ్గించటం తెలిసిందే. ఇప్పుడు పరిస్థితి మరింత మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కేవలం 2 శాతానికే పరిమితం కావొచ్చన్న అంచనాను చెబుతున్నారు. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ వేసిన ఈ లెక్కలు వింటే గుండెలు అదిరిపోవటం ఖాయం.

ఒకరి తర్వాత ఒకరు చొప్పున భారత్ వృద్ధి రేటుపై తమ అంచనాల్ని వెల్లడిస్తున్నారు. గత వారం మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ భారత్ వృద్ధి రేటును 5.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించగా.. ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ 3.5 శాతానికి.. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ 3.6 శాతానికి కుదించాయి.

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి అమలవుతున్న వేళ.. ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ భారత వృద్ధి రేటును అంచనా వేస్తూ.. నాలుగు శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. ఈ అంచనాలతో పోలిస్తే.. మిగిలిన వారి లెక్కలు మరింత నిరాశను కలిగించేలా ఉన్నాయని చెప్పక తప్పదు. ఇదంతా చూసినప్పుడు.. ప్రస్తుతం నడుస్తున్నదంతా అసాధారణ గడ్డుకాలంగా చెప్పక తప్పదు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు నష్టపోయేది దగ్గర దగ్గర 2 నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల మేర ఉంటుందని చెబుతున్నారు. ఇది ప్రపంచ జీడీపీలో 2.3 నుంచి 4.8శాతంగా చెబుతున్నారు. ఇంత భారీ నష్టం నుంచి ప్రపంచం.. ఆయా దేశాలు.. వ్యక్తులు ఎప్పటికి కోలుకుంటారన్నది చెప్పటం అంత తేలికైన విషయం కాదు.