Begin typing your search above and press return to search.

ఫాల్కన్ 9 ప్ర‌యోగం స‌క్సెస్‌: ‌స‌త్తా చాటిన భార‌త యువ‌తి

By:  Tupaki Desk   |   2 Jun 2020 9:50 AM GMT
ఫాల్కన్ 9 ప్ర‌యోగం స‌క్సెస్‌: ‌స‌త్తా చాటిన భార‌త యువ‌తి
X
అంత‌రిక్షం మ‌న ఊహాకు అంద‌నంత పెద్ద‌గా ఉంటుంది. విశ్వ‌మంతా అని చెబుతామే అది ఇది. అయితే అంత‌రిక్షంలోకి వెళ్లాలంటే రాకెట్‌ల‌లోనే వెళ్లాలి. అంత‌రిక్షంలోకి కాకుండా ఆకాశంలోకి వెళ్లేందుకు విమానాలు కావాలి. అయితే ఆకాశానికి.. విశ్వానికి మ‌ధ్య‌న స్పేస్ స్టేష‌న్‌లు అనేవి కొన్ని ఉన్నాయి. వాటిని ప్ర‌పంచంలోని ఐదు దేశాలు మాత్ర‌మే ఏర్పాటుచేసుకున్నాయి. వాటినే అంతరిక్ష కేంద్రం అని అంటారు. భూమి నుంచి 408 కిలో మీట‌ర్ల దూరంలో ఆ అంత‌రిక్ష కేంద్రాలు ఉన్నాయి. వాటిని ఏర్పాటు‌చేసుకున్న దేశాలు ఆమెరికా, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా ఉన్నాయి. ఈ ఐదు దేశాలు నిరంతరం అంత‌రిక్షంలోకి ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఆ స్పేస్ స్టేష‌న్‌లోకి వెళ్లేలా చేసి ఫాల్క‌న్ ప్ర‌యోగం అద్భుత విజ‌య‌వం సాధించింది. ఈ ప్ర‌యోగంలో ‌భార‌త‌దేశానికి చెందిన ఓ యువ‌తి కీల‌క పాత్ర పోషించంది.

‘స్పేస్‌ ఎక్స్‌’ అనే ఒక అమెరికన్‌ ప్రైవేటు సంస్థ ఇద్ద‌రిని స్పేస్ స్టేష‌న్‌ లోకి పంపింది. అంతరిక్షయాన చరిత్రలోనే ఒక ప్రైవేటు సంస్థ ఇలా రోదసీలోకి మనుషుల్ని పంపడం తొలిసారి. వాళ్లను ‘క్రూ డ్రాగన్‌’ అనే వ్యోమనౌకలో పైన వదిలి పెట్టిన ‘ఫాల్కన్‌ 9’ రాకెట్‌ వెంటనే భూమి మీదికి తిరిగి వచ్చేసింది. టు అండ్‌ ఫ్రో.. రాకెట్‌ ప్రయాణం సక్సెస్‌. ఈ అద్భుత ప్ర‌యాణంలో భార‌త‌దేశానికి చెందిన 24 ఏళ్ల కణిక ఉంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో కి చెందిన కణిక గ‌ఖ‌ర్ ప్రస్తుతం బోస్టన్‌లోని ఎంఐటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తోంది. 2018లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థినిగా ఉన్నప్పుడు ‘స్పేస్‌ ఎక్స్‌’ లో ఇంటెర్న్‌గా పని చేసింది. భూమిపై నుంచి లేచేందుకు, తిరిగి భూమి మీద దిగేందుకు ఫాల్కన్‌ 9కు బలమైన కుదురు కాళ్లను (ల్యాండింగ్‌ లెగ్స్‌) డిజైన్‌ చేసిన బృందంలో క‌ణిక గ‌ఖ‌ర్ కూడా ఒక‌రు. స్పేస్‌ ఎక్స్‌ బృందంలోని ఎనిమిది మందిలో కణికా కీలక సభ్యురాలు.

అమెరికాలోని ప్రఖ్యాత ప్రైవేటు అంతరిక్షయాన, సాంకేతిక పరిజ్ఞాన సంస్థ స్పేస్‌ ఎక్స్. ఈ సంస్థ‌ నాసాకు చేయూతనిచ్చేది. ఈ సంస్థ‌లో క‌ణిక‌ మూడు నెలలు ఇంటెర్న్‌షిప్ చేసింది. ఫాల్కన్‌ 9 ల్యాండింగ్‌ లెగ్స్‌ డిజైనింగ్‌లో ప్రధానమైన బాధ్యతలు ఆమెకే అప్పగించారు. మూడుసార్లు ఇంటర్వ్యూకు వెళ్లిన త‌ర్వాత ఇంటెర్న్‌‌షిప్‌కు ఎంపిక‌య్యింది. టీమ్‌లో సీనియర్స్‌ ఉన్నా తడబ‌డ‌కుండా టీమ్‌ని నడిపించింది. స్పేస్‌ ఎక్స్ యజమాని ఎలాన్‌ మస్క్‌తో, ఇప్పుడు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు డో హర్లీ, బాబ్‌ బెన్కెన్‌తో కూడా ఫాల్కన్‌ 9 డిజైనింగ్‌లోని మార్పు చేర్పులపై క‌ణిక చ‌ర్చించేది. అయితే ఇంట‌ర్న్‌షిప్ అయిపోగా ఈ ఏడాది ఆగస్టుతో ఆమె చదువు ముగియ‌నుంది. వెంటనే ఉద్యోగం పొందింది. అది స్పేస్‌ఎక్స్ సంస్థ‌లోనే.

పెద్దయ్యాక ఏం అవుతావని క‌ణిక‌ను తల్లీతండ్రులు సందీప్, సిమీ అడిగితే రాకెట్‌ లో దూసుకెళ్తా అని చెప్పిందంట‌. పిల్ల‌ల చదువు కోసం తల్లిదండ్రులు బెంగళూరు నుంచి హ్యూస్టన్‌ వచ్చేశారు. పదో తరగతి వరకు బెంగళూరులోనే చదివారు. తర్వాత సింగపూర్‌ లో ఐబీ స్కూల్‌ లో చేరారు. టెక్సాస్‌లోని ఎ అండ్‌ ఎం యూనివర్సిటీ లో క‌ణిక డిగ్రీ చేసింది.

స్పేస్ ఎక్స్‌ను ఎలాన్‌ మస్క్ స్థాపించారు. ఈ సంస్థ వ్యోమనౌకల్ని తయారుచేస్తోంది. అంతరిక్షయానానికి ఏర్పాట్లు చేస్తుంది. అంగారకుడిలో మానవుల కోసం ఒక కాలనీ నిర్మించేందుకు, అక్కడికి భూగోళం నుంచి మనుషుల్ని తీసుకెళ్లేందుకు ఏళ్లుగా ప్రయోగాలు చేస్తోంది. మ‌స్క్‌ కు దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా పౌర‌స‌త్వం ఉంది. టెస్లా కార్ల తయారీ కంపెనీ కూడా అతడిదే. ఇంకా అనేక వాణిజ్య సంస్థలు అత‌డికి ఉన్నాయి. మొదటి భార్య రచయిత్రి. రెండో భార్య బ్రిటిష్‌ నటి. ఇద్దరికీ విడాకులిచ్చేశాడు. ప్రస్తుతం గ్రైమ్స్‌ అనే కెనడా గాయని తో స‌హ‌ జీవ‌నం చేస్తున్నాడు. అత‌డికి ఆరుగురు సంతానం.