Begin typing your search above and press return to search.

భారీ వర్షాల నష్టానికి జగన్ కేంద్రాన్నిఅడిగింది ఎంతంటే?

By:  Tupaki Desk   |   18 Oct 2020 6:50 AM GMT
భారీ వర్షాల నష్టానికి జగన్ కేంద్రాన్నిఅడిగింది ఎంతంటే?
X
భారీ వర్షాలతో ఏపీ భారీగా నష్టపోయింది. ఓపక్క కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు గురైతే.. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా కురిసిన భారీ వర్షాలతో కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని పేర్కొన్న ఆయన.. ఏపీకి తక్షణ సాయాన్ని అందించాలని కోరారు.

భారీ వర్షాలు.. వరదలతో ఏపీ తీవ్రంగా నష్టపోయినట్లుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు అధికారులు వేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపురూ.4450కోట్ల నష్టం వాటిల్లినట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే రూ.2250 కోట్ల ఆర్థికసాయాన్ని అందించాలని కోరారు. భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న నష్టాలతో రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైందని.. తమను ఆదుకోవాల్సిందిగా ఆయన కోరారు.

ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా ఎంతో నష్టపోయామని.. దీనికి తోడుతాజాగా కురిసిన వర్షాలు.. వరదల కారణంగా పరిస్థితి దారుణంగా తయారైందని కోరారు. ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర సాయం అవసరమని.. తమను ఆదుకోవాలని కోరారు. వరదల కారణంగా చోటు చేసుకున్న నష్టం దగ్గరదగ్గర రూ.5వేల కోట్లు అయితే.. తక్షణ సాయం కింద రూ.2250 కోట్లు కోరటం గమనార్హం.

రాష్ట్రాలను ఆదుకునే విషయంలోనూ.. సాయాన్ని అందించే విషయంలో మోడీ సర్కారు ఎంతకఠినంగా ఉంటుందో తెలిసిందే. అలాంటివేళ.. తక్షణ సాయాన్ని మరికాస్త ఎక్కువ చేసి అడిగితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. సీఎం జగన్ లేఖకు కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.