Begin typing your search above and press return to search.

ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి...ఎంత కాలం పనిచేస్తాయి

By:  Tupaki Desk   |   23 Oct 2021 2:30 AM GMT
ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి...ఎంత కాలం పనిచేస్తాయి
X
రాజకీయ పార్టీలకు చెందిన అల్లరి మూకలు పోలింగ్ కేంద్రాలను లూటీ చేయడం, బ్యాలట్ బాక్సులను ఎత్తుకెళ్లిపోవడం వంటి చర్యల కారణంగా దశాబ్దాలపాటు ఎన్నికల నిర్వహణ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ప్రవేశంతో ఈ పరిస్థితికి అడ్డుకట్ట పడింది. కానీ వీటిపై ఎన్నో అనుమానాలు, విమర్శలు. ఈ యంత్రాలను హ్యాకింగ్ చేయవచ్చని, రిగ్గింగ్‌ కు పాల్పడవచ్చంటూ ఎన్నికల్లో పరాజయం పాలైన పార్టీలు ఆరోపించడం సాధారణమైపోయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన చాలా ఏళ్ల వరకు బ్యాలెట్‌ (కాగితం) తోనే ప్రజలు ఓటు వేసేవారు. సాంకేతికతకు అనుగుణంగా ఓటింగ్‌ విధానంలోనూ మార్పులు వచ్చాయి. కాగితంతో లెక్కింపు, భద్రపరచడం తదితర కారణాలతో ఓటింగ్‌ ప్రక్రియ అధిక సమయం తీసుకుంటుందని కేంద్రం గుర్తించింది. అందుకే, దేశంలో 1982 నుంచి ఈవీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌. ఈవీఎంలు మొదటిసారిగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. ఈవీఎంలో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది కంట్రోల్‌ యూనిట్‌ కాగా, రెండవది బ్యాలెటింగ్‌ యూనిట్‌. కంట్రోల్, బ్యాలెటింగ్‌ యూనిట్లను ఒకేసారి కనెక్ట్‌ చేస్తారు. కంట్రోల్‌ యూనిట్‌ పోలింగ్‌ బూత్‌ ఆఫీసర్‌ వద్ద ఉంటుంది. బ్యాలెటింగ్‌ యూనిట్‌లో ఓటర్లు ఓటు వేస్తారు. కంట్రోల్‌ యూనిట్‌లో ఉన్న బ్యాలెట్‌ బటన్‌ పోలింగ్‌ బూత్‌ ఆఫీసర్‌ ప్రెస్‌ చేసినప్పుడు మాత్రమే బ్యాలెటింగ్‌ యూనిట్‌లో ఓటరు ఓటు వేయగలడు. ఒక్కసారి బ్యాలెట్‌ యూనిట్‌లో ఓటరు పక్కనున్న అభ్యర్థి బటన్‌ క్లిక్‌ చేయగానే లైట్‌ వెలుగుతుంది. వెంటనే బజర్‌ సౌండ్‌ వస్తుంది. తర్వాత ఈవీఎం లాక్‌ అవుతుంది. పోలింగ్‌ బూత్‌ ఆఫీసర్‌ కంట్రోల్‌ యూనిట్‌లో బటన్‌ ప్రెస్‌ చేస్తే తిరిగి ఓపెన్‌ అవుతుంది.

ఈవీఎంలు నిమిషానికి ఐదు ఓట్లు మాత్రమే పరిమితం చేస్తాయి. ఈవీఎంలు 6 ఓల్ట్‌ అల్కాలైన్‌ బ్యాటరీల ద్వారా పనిచేస్తాయి. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో 16 క్యాండెట్స్‌ ను ఉంచవచ్చు. అలా నాలుగు బ్యాలెట్‌ యూనిట్‌లను కనెక్ట్‌ చేయవచ్చు. ఒక్క నియోజకవర్గంలో 64 మంది క్యాండెట్స్‌ కే పరిమితం ఉంటుంది. ఒకవేళ 64 మందికి పైగా క్యాండెట్స్‌ ఉంటే ఆ నియోజకవర్గంలో బ్యాలెట్‌ పేపర్లతో ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఒక్క ఈవీఎం 3,840 ఓట్లను స్టోర్‌ చేస్తుంది. ఈవీఎంలు హాక్‌ అవ్వవు. ఈ సాఫ్ట్‌ వేర్‌ ను సిలికాన్‌ చిప్‌ లో ఉంచేస్తారు.

ఈవీఎంలు అక్కడక్కడా టాంపరింగ్‌ అవుతున్నాయని వార్తలు రావడంతో ఎలక్షన్‌ కమిషన్‌ ఓటరు– వెరిఫైడ్‌ పేపర్‌ అడిట్‌ ట్రయల్‌ (వీవీప్యాట్‌) అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఓటరు బ్యాలెటింగ్‌ యూనిట్‌ బటన్‌ నొక్కగానే దేనికి ఓటు వేశాడో ఒక పేపర్‌పైనే ప్రింట్‌ అవుతుంది. ఇది కొన్ని సెకన్లు ఉండి వెళ్లిపోతుంది. ఓటరు సరిగ్గా ఓటు వేశాడో లేదో చూసుకోవచ్చు. వీవీప్యాట్‌లు సీజ్‌ చేసి ఉంటాయి. ఈవీఎం టాంపరింగ్‌ అయిందని అనుమానం వస్తే వీవీప్యాట్‌లో ప్రింట్‌ అయిన ఓట్లను బ్యాలెట్‌ పేపర్‌లాగా లెక్కిస్తారు.

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌) బెంగళూరు, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌), హైదరాబాద్‌. ఈవీఎంలకు వాడే సాఫ్ట్‌ వేర్‌ కోడ్‌ అందులో పనిచేసే ఇంజినీర్లకు మాత్రమే తెలుసు. ఈవీఎంలలో మూడు మోడల్స్‌ ఉన్నాయి. మొదటి మోడల్‌ను 1989–2006 వరకు మ్యాన్‌ ఫ్యాక్చర్‌ చేశారు. దీనిని 2014 ఎన్నికల్లో చివరిగా వినియోగించారు. రెండో మోడల్‌ 2006 నుంచి 2012 వరకు మ్యాన్‌ఫ్యాక్చర్‌ చేశారు. మూడో మోడల్‌ 2013లో మ్యాన్‌ ఫ్యాక్చర్‌ చేయగా, ప్రస్తుతం దీనినే ఉపయోస్తున్నారు. ఇది ట్యాంపర్‌ ప్రూఫ్‌ మోడల్‌. ఒక్కసారి మ్యాన్‌ఫ్యాక్చర్‌ చేసిన ఈవీఎంలను 15 సంవత్సరాల వరకు వినియోగిస్తారు. తరువాత ఈవీఎంలో చిప్స్‌ను ఎలక్షన్‌ ఆఫీసుకు అప్పగిస్తారు.

భారత్‌ లో వినియోగిస్తున్న 1.6 కోట్ల ఓటింగ్ యంత్రాల్లో ఒక్కోదానిలో 2000 ఓట్లు నమోదు చేయవచ్చు. 64 మంది అభ్యర్థుల పేర్లను చూపించవచ్చు. భారత్‌ లోనే తయారయ్యే ఈ మెషీన్లను బ్యాటరీ పవర్‌ తో కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల కరెంటు సౌకర్యం సరిగా లేని మారుమూల గ్రామాల్లో సైతం వీటితో ఎన్నికలు నిర్వహించవచ్చు. దీనిలో ఉపయోగించే సాఫ్ట్‌ వేర్‌ ను ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందం అభివృద్ధి చేసింది. ఈ బృందానికి తప్ప వేరెవరికీ ఈ సాఫ్ట్‌ వేర్ గురించి గానీ, ఈవీఎంలకు సంబంధించిన ఇతర వివరాల గురించి గానీ తెలిసే అవకాశం లేదని ఈసీఐఎల్ వర్గాలు స్పష్టం చేశాయి. ఎవరైనా బలవంతంగా, నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు వేయాలని ప్రయత్నిస్తే, మెషీన్ పనిచేయకుండా చేసేలా ఈవీఎంపై ఓ బటన్ కూడా ఉంది.