Begin typing your search above and press return to search.

గుండెల్లో దడ పుట్టే ప్రచారానికి చెక్ పెడుతూ రిలీఫ్ ఇచ్చిన ఐసీఎంఆర్

By:  Tupaki Desk   |   7 July 2020 6:15 AM GMT
గుండెల్లో దడ పుట్టే ప్రచారానికి చెక్ పెడుతూ రిలీఫ్ ఇచ్చిన ఐసీఎంఆర్
X
ఇదిగో తోక అంటే అదిగో పులి అనే వారు మన చుట్టూ చాలామందే ఉంటారు. అందునా.. మహమ్మారి లాంటి శత్రువు మానవాళి మీద విరుచుకుపడే వేళలో.. పనికిరాని ప్రచారాలు చేసే వారు భారీగానే ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా వాదనల్ని తెర మీదకు తీసుకొస్తూ.. ప్రజల్ని భయాందోళనలకు గురి చేయటమే కాదు.. కన్ఫ్యూజన్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తున్నారు. దేన్ని నమ్మాలి? దేన్ని నమ్మకూడదన్నది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఇలాంటి విషయాలపై మీడియా సైతం ఫుల్ క్లారిటీ ఇస్తే సరిపోతుంది. కానీ.. అందుకు భిన్నంగా రోజుకో ప్రచారాన్ని హైలెట్ చేయటంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.

గడిచిన రెండు.. మూడు రోజులుగా ఒక విష ప్రచారం జోరుగా సాగుతోంది. మహమ్మారికి గాలితో సోకే గుణం ఉందన్న విషయాన్ని గుర్తించినట్లుగా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ సాగుతోంది. నిజంగానే మహమ్మారికి అంత సీన్ ఉంటే.. పరిస్థితి ఇప్పటిలా ఉండే అవకాశమే లేదని చెప్పాలి. అయితే.. ఇలాంటి ప్రచారానికి లాజిక్కుల కంటే కూడా శాస్త్రీయంగా సమాధానం చెప్పటం ద్వారానే చెక్ చెప్పే వీలుంది.

గాలితో మహమ్మారి వ్యాప్తి చెందుతుందన్న విషయంపై తాజాగా ఐసీఎంఆర్ సీనియర్ సైంటిస్టు డాక్టర్ లోకేశ్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని ధ్రువీకరించలేదని తేల్చేశారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. అలా జరుగుతుందని చెప్పేందుకు ఒక్క ఆధారం కూడా లేదన్నారు. అయితే.. మహమ్మారి తనను తాను మార్చుకుంటోందని.. అంతే తప్పించి.. గాలితో వ్యాపించే గుణం మాత్రం లేదని స్పష్టం చేశారు.

గాలిలో ఉండే చిన్న కణాల ద్వారా మహమ్మారి వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక శాస్త్రవేత్తల టీం చెప్పింది. వారి వాదన ప్రకారం బాధితులు తమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు గాల్లోని చిన్న కణాల్లో ప్రవేశించి.. తిరుగుతుంటాయని.. ఆ వాతావరణంలోకి ఆరోగ్యవంతులు ఎవరొచ్చినా.. వారిని అంటుకుంటుందని చెబుతున్నారు. అయితే.. ఈ వాదనను కొట్టిపారేస్తూ.. ఐసీఎంఆర్ సీనియర్ సైంటిస్టు స్పష్టత ఇస్తున్నారని చెప్పాలి.