సాగు చట్టాల రద్దుకు ఉభయ సభలు ఆమోదం .. ఆందోళన కొనసాగిస్తామన్నా టికాయత్

Mon Nov 29 2021 23:00:01 GMT+0530 (IST)

House of Commons approves repeal of cultivation laws

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన 10 రోజుల వ్యవధిలోనే చట్టపరమైన ప్రక్రియ పూర్తికావొచ్చింది. సాగు చట్టాల రద్దు బిల్లు-2021 ను లోక్ సభ ఆమోదించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం నాడే సాగు చట్టాల రద్దు బిల్లును వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో ప్రవేశపెట్టగా.. భారీ మెజార్టీతో బిల్లు ఆమోదం పొందింది. అయితే సాగు చట్టాల రద్దు బిల్లుపై సభలో చర్చ జరపాలని అసలా చట్టాలను కేంద్రం ఎందుకు తెచ్చిందో ఎవరి కోసం తెచ్చిందో తీరా ఎన్నికల ముందు ఎందుకు ఉపసంహరించుకుందో సమగ్రంగా చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సహా పలు విపక్షపార్టీలు పట్టుపట్టాయి.సాగు చట్టాలు చేసినప్పుడూ చర్చ చేయలేదు కనీసం రద్దు బిల్లుపైన అయినా చర్చకు అనుమతించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ను కోరారు. అందుకు అనుమతి లభించకపోవడంతో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్షాల అరుపులు నినాదాలపై అధికార పక్షం నుంచి అదే స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది.

ఉదాత్తమైన ఉద్దేశాలతో తీసుకొచ్చిన సాగు చట్టాలను కొందరు రైతులు సరిగా అర్థం చేసుకోలేకపోయినందున వాటిని రద్దు చేసుకుంటున్నామంటూ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టత ఇచ్చారని మోదీ స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పడమే సరిపోతుందని అలాంటప్పుడు సాగు చట్టాల రద్దుపై సభలో చర్చ అనవసరమని అధికార బీజేపీ ఎంపీలు వాదించారు. మూడు సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది.ఉభయ సభల్లోనూ దీనిపై చర్చకు ఎలాంటి అవకాశమివ్వలేదు. సాగు చట్టాలు తెచ్చిన సందర్భంలో మళ్లీ ఇప్పుడు రద్దు చేసిన తరుణంలో చర్చ లేకుండానే తంతు ముగించడంతో మోదీ సర్కారుపై విపక్షాలు మండిపడుతున్నాయి.

సాగు చట్టాల రద్దు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్న కాసేపటికే వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమరే రాజ్యసభలోనూ బిల్లును పెట్టారు. లోక్ సభలాగే రాజ్యసభలోనూ చర్చ కోసం విపక్షాలు పట్టు పట్టడంతో సభలో అరుపులు నినాదాలు వినిపించాయి. చివరికి లోక్ సభ మాదిరిగానే గందరగోళం మధ్యే రాజ్యసభలోనూ మూజువాణి ఓటుతో సాగు చట్టాలు రద్దయినట్లు సభాపతి ప్రకటించారు. ఈ బిల్లును ఇవాళే రాష్ట్రపతి భవన్ కు పంపుతారని తెలుస్తోంది. వీటిపై రాష్ట్రపతి సంతకం లాంఛనమే.

కొత్త వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది నుంచి తాము చేస్తోన్న పోరాటానికి ప్రతిఫలం దక్కిందని చెబుతున్నారు. అయితే ఇతర డిమాండ్లూ నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. దేశంలో నిరసనలు ప్రదర్శనలు ఏవీ జరగకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే కనీస మద్దతు ధరతో పాటు మా ఇతర డిమాండ్లపై ఇప్పటికీ చర్చించలేదు. వాటిపై చర్చించే వరకు మేము ఆందోళన కొనసాగిస్తాం. కొత్త సాగు చట్టాల రద్దు కోసం ఆందోళనల్లో పాల్గొని 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు లోక్‌సభలో సాగుచట్టాల రద్దు బిల్లు ఆమోదం పొందడంతో ఆ రైతులకు దాని ద్వారా నివాళులు అర్పించినట్లు అయింది.