Begin typing your search above and press return to search.

అన్నకి కరోనా , హాస్పిటల్ లో చేర్పించి చూడటానికి వెళ్తే .. శవాన్ని చూపించిన సిబ్బంది !

By:  Tupaki Desk   |   4 Aug 2020 4:30 PM GMT
అన్నకి కరోనా , హాస్పిటల్ లో చేర్పించి చూడటానికి వెళ్తే .. శవాన్ని చూపించిన సిబ్బంది !
X
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో లక్షా అరవై వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరణాలు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇకపోతే సామాన్యుల నుండి ప్రముఖులు , ప్రజాప్రతినిధులు కూడా కరోనా భారిన పడుతున్నారు. ఈ విషయం ఇలా ఉంటె ..కొంతమంది రాష్ట్రంలో కరోనా ఆసుపత్రుల్లో పేషేంట్స్ ను సరిగ్గా పట్టించుకోవడం లేదని , కనీసం చనిపోయిన కూడా కొన్ని సమయాల్లో కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ తరహా సంఘటన మరొకటి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్‌ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినా తమకి సమాచారం ఇవ్వలేదని ప్రక్కిలంకలో మృతుడి బంధువులు, స్థానికులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. ప్రక్కిలంక గ్రామానికి చెందిన ఒక యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ‌ ఏలూరు ఆశ్రం కరోనా‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా కి చికిత్స తీసుకుంటూ ఆ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. అయితే చనిపోయిన సమాచారం కుటుంబ సభ్యులకు తెలుపలేదు.

దీనితో మామూలుగానే ఆస్పత్రిలో ఉన్న అన్నను చూసేందుకు అతని తమ్ముడు ఆస్పత్రికి వెళ్ళాడు. అయితే , తన అన్న ఎక్కడా అని అడిగితే ఆస్పత్రి సిబ్బంది సరైన సమాధానం చెప్పకుండా ఇబ్బందులు పెట్టి నాలుగు గంటల తర్వాత మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూపారని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. తన సోదరుడి ఫోన్‌ ను కూడా మాయంజేశారని మృతుడి తమ్ముడు వాపోయాడు. సరైన వైద్యం అందకపోవడం వల్లే తన అన్న చనిపోయాడని అతను ఆరోపించాడు. ఈ మేరకు సోమవారం ప్రక్కిలంకలో బంధువులు, గ్రామస్థులు కొద్దిసేపు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు.