Begin typing your search above and press return to search.

తొలిసారి అణ్వ‌స్త్ర ప‌రీక్ష జ‌రిగిన‌ది ఈనాడే.. ఏంటి ప్ర‌త్యేక‌త తెలుసుకోండి

By:  Tupaki Desk   |   17 July 2020 12:30 AM GMT
తొలిసారి అణ్వ‌స్త్ర ప‌రీక్ష జ‌రిగిన‌ది ఈనాడే.. ఏంటి ప్ర‌త్యేక‌త తెలుసుకోండి
X
ఒక్క ఆయుధం మొత్తం భూభాగాన్ని భ‌స్మం చేసేది అణ్వాయుధం. ప్ర‌స్తుతం ప్రపంచ దేశాల‌న్ని అణ్వాయుధాల‌ను పెంచుకుంటున్నాయి. ఎవ‌రైనా శ‌త్రువు దేశం వెంట‌నే దాడి చేసేందుకు.. ఆ దేశాన్ని భ‌స్మం చేసే స్థాయిలో అణ్వాయుధానికి ఉంటుంది. అలాంటి అణ్వాయుధం తొలిసారి పేల్చిన రోజు మాత్రం ఈరోజే (1945 జులై 16వ తేదీ). తొలి అణ్వాయుధ పరీక్ష అమెరికాలో న్యూ మెక్సికో లోని అలోమాగార్డో ఎయిర్ బేస్ లో జ‌రిగింది. ట్రినిటీ అనే పేరు కలిగిన కోడ్ తో ఈ పరీక్ష నిర్వ‌హించారు. నేటితో ఆ ప‌రీక్ష‌‌కు75 సంవత్సరాలు అవుతోంది .

ఈ పరీక్ష జరిగిన కొన్ని వారాల్లోనే అణ్వాయుధం తొలిసారి శ‌త్రు దేశంపై వినియోగించారు. 1945 ఆగష్టు 6వ తేదీన జపాన్ లోని రెండు నగరాలు హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబు వేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ బాంబు దాడితో హిరోషిమా న‌గ‌రంలో 90 వేల నుంచి 1,66,000 మంది ప్రజలు మృత్యువాత ప‌డ్డార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇక నాగసాకి న‌గ‌రంలో 60 వేల నుంచి 80 వేల మంది దాక మరణించినట్లు అంచనా. అందులో సగం మరణాలు బాంబు దాడి జరిగిన రోజే చోటుచేసుకోవ‌డం క‌ల‌చివేసే విష‌యం. అంత‌టి తీవ్ర ప్ర‌భావం అణ్వాయుధం వ‌ల‌న ఉంటుంది.

న్యూక్లియర్ ఆయుధాలను ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన ఆయుధాలుగా పేర్కొంటారు. అణ్వాయుధాలు చాలా శక్తిమంతమైన పేలుడు పదార్ధాలు. ఆటం, ఐసోటోప్ అనే ప‌దార్థాల ద్వారా బాంబు పేలి తీవ్ర విస్ఫోట‌నం జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. పరమాణు శక్తిని విస్ఫోటనం చెందించడం ద్వారా భారీ పేలుడును సృష్టించేలా అణుబాంబులు తయారు చేస్తారు. అందుకే దీనికి అణుబాంబు అని పేరు పెట్టారు. ఈ ఆయుధాలు అధిక మొత్తంలో రేడియేషన్ ని విడుదల చేస్తాయి. దీని ప్ర‌భావంతో రేడియేషన్ సిక్ నెస్ ఏర్పడి మాన‌వ‌.. జీవ జాతి.. మొత్తం వాతావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌.. భూమే అల్ల‌క‌ల్లోలం అవుతుంది. పేలుడు క‌న్నా ఆ తరువాత కలిగే దుష్ప్రభావాలే ఏళ్ల పాటు ఉంటాయి. అప్ప‌టి అణుబాంబు ప్ర‌యోగం ద్వారా ఇప్ప‌టికీ జ‌పాన్‌లోని హిరోషిమా, నాగ‌సాకి న‌గ‌రాల్లో ప‌చ్చ‌ద‌నం.. ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం లేదు.

ఇప్ప‌టివ‌ర‌కు ప్రపంచంలో కేవ‌లం తొమ్మిది దేశాలు మాత్ర‌మే అణ్వాయుధ శ‌క్తిని క‌లిగి ఉన్నాయి. అమెరికా, యుకే (బ్రిట‌న్‌), రష్యా, ఫ్రాన్స్, చైనా, భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా. దేశాల మధ్య న్యూక్లియర్ ఆయుధాల సమకూర్పు కోసం పోటీ తారాస్థాయిలో ఉంటుంది. ఈ క్ర‌మంలో 1961లో సోవియెట్ యూనియన్ పరీక్షించిన త్సార్ (TSAR) బాంబు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బాంబుగా పరిగణిస్తున్నారు. ఈ బాంబును ఆర్క్టిక్ నోవాయా జెమిలియా ద్వీపంలో సుఖోయ్ నోస్ పరీక్షా కేంద్రం దగ్గర పరీక్షించారు. 1952 లో అమెరికా అణుబాంబుల కంటే శక్తివంతమైన 10 మెగా టన్నుల పేలుడు శక్తి కలిగిన తొలి హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. దీనిని ఐవీ మైక్ అనే పేరుతో పసిఫిక్ మహా సముద్రంలోని మార్షల్ ఐలాండ్స్ లో ఈ బాంబును పరీక్షించారు.

- 1954 లో మార్షల్ ఐలాండ్స్ లో బికినీ ఆటోల్ లో పేల్చిన కాసిల్ బ్రావో అమెరికా ప్రయోగించిన అతి పెద్ద అణు బాంబు. దీని పేలుడు వలన సంభవించే పరిణామాల వలన ఇది ఎక్కువగా గుర్తు ఉండిపోతుంది. ఈ పేలుడు వలన పుట్టగొడుగు లాంటి మబ్బులు నాలుగు మైళ్ల‌ దూరం వరకు వ్యాపించి వచ్చే రేడియేషన్ 11,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది.
- భారతదేశంలో తొలిసారి భూగర్భ అణు పరీక్షలు రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో 1974లో జరిగాయి.
- 1945లో ఇప్పటివరకు చరిత్రలో అణుబాంబులను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్ర‌యోగించారు. ఆ రెండు బాంబులు జపాన్ మీద రెండుసార్లు ప్రయోగించారు.
- ఈ ఆయుధాలను తయారుచేయడానికి సాంకేతిక ప‌రిజ్ఞానం, నైపుణ్యం, సౌకర్యాలు ఉన్న వారెవరైనా సరే వీటిని తయారు చేయవ‌చ్చు. అణ్వాయుధాలను తగ్గించి వీటి తయారీని ఆపాలనే ఉద్దేశంతో అణు నిరాయుధీకరణ ఒప్పందం అన్ని దేశాలు వాటిని తయారుచేసేందుకు వీలు లేదు. ఈ ఒప్పందంలో 1970 నుంచి సుమారు 191 దేశాలు భాగస్వాములయ్యాయి. 1967లో ఈ ఒప్పందం జరగకముందే అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా అణ్వస్త్ర కేంద్రాల నిర్మాణం చేపట్టడంతో ఈ ఐదు దేశాలు మాత్రం అణ్వాయుధాలు సమకూర్చుకునే హక్కును కలిగి ఉన్నాయి. అయితే, వీటికి కూడా పరిమితి ఉంటుంది.
- 1986లో 70,000 దాకా ఉన్న అణ్వాయుధాలు ఇప్పుడు దాదాపు 14,000 ఉన్నాయి.
- చైనా, పాకిస్తాన్, ఇండియా, ఉత్తర కొరియా మాత్రం ఎక్కువ అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య చెబుతోంది.