Begin typing your search above and press return to search.

తిరుపతి ఎంపీ ఆస్తులెంతో తెలిస్తే ఆశ్చర్యమే!

By:  Tupaki Desk   |   3 May 2021 8:30 AM GMT
తిరుపతి ఎంపీ ఆస్తులెంతో  తెలిస్తే ఆశ్చర్యమే!
X
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందడంతో ఆ పార్లమెంటు స్థానానికి ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు విడుదలవగా ఆయన ఏకంగా రెండున్నర లక్షల పైచిలుకు మెజారిటీ తో ఎంపీగా విజయం సాధించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ ఎంపీగా అభ్యర్థిగా కానీ పోటీలోకి దిగితే భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థులే ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక ఎంపీగా పోటీపడే అభ్యర్థులు అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ తిరుపతి ఎంపీ గా విజయం సాధించిన గురుమూర్తి.. తన వద్ద కేవలం రూ. 10 లక్షలు కూడా చేతిలో లేకుండానే విజయం సాధించారని అంటున్నారు.

సీఎం జగన్ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని ప్రకటించగానే ఆయన వెంటనే సీఎంను కలిశారని తన వద్ద ప్రస్తుతానికి చేతిలో రూ.పది లక్షలు కూడా లేదని మరి మీ నమ్మకాన్ని నిలబెట్టుకోగలనా అని సందేహించినట్లు సమాచారం. అయితే దీనికి సీఎం జగన్ చిరునవ్వుతో గెలుపు మీదేనంటూ ఆశీర్వదించి పంపించారని అప్పట్లో ప్రచారంలో కూడా వచ్చింది. అయితే గురుమూర్తి దగ్గర నిజంగా ఆస్తులు లేవా.. ఉంటే ఏమేమి ఉన్నాయి, ఆయనకు తిరుపతి నియోజకవర్గంలో ఉన్న పలుకుబడి ఏంటి? అనే విషయాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలంలోని మున్నసముద్రం గ్రామానికి చెందిన గురుమూర్తి స్విమ్స్ లో ఫిజియోథెరపీ చేశారు. ఆయనకు భార్య నవ్య కిరణ్, కొడుకు కార్తికేయ నిక్షాల్, కూతురు డెలీనా ఉన్నారు. గురుమూర్తి మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతున్నారు. వైయస్ షర్మిల పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఆమెకు గురుమూర్తి సపోర్టుగా నిలిచి పాదయాత్ర అసాంతం ఆమె వెంట ఉన్నారు.

అలాగే గత ఎన్నికలకు ముందు జగన్ ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించారు. ఆ సమయంలో ఫిజియోథెరపిస్టు అయిన గురుమూర్తి పాదయాత్రలో జగన్ వెంట నడిచారు. ఆరోగ్యపరంగా జగన్ బాగోగులు చూసుకున్నారు.
తిరుపతి ఎంపీ మృతిచెందడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో వైసీపీ తరఫున అభ్యర్థిగా గురుమూర్తి పోటీ చేస్తారని సీఎం జగన్ ప్రకటించగానే అంతటా ఆశ్చర్యం వ్యక్తం అయింది.

గురుమూర్తి ఎన్నికల నామినేషన్ లో వెల్లడించిన ఆస్తుల వివరాలు కూడా అందరికీ షాక్ ఇచ్చాయి. ఆయన తన పేరు మీద కారు కూడా లేనట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తం తమ కుటుంబ ఆస్తులు 47.25 లక్షలుగా చెప్పారు. ఇందులో గురుమూర్తి వ్యక్తిగత ఆస్తి కేవలం 10,66, 515 విలువైన ఆస్తులు ఉన్నాయి. ఆయన భార్య నవ్య పేరు మీద 24 లక్షల 92 వేల చరాస్తులు ఉన్నట్లు చెప్పారు. అలాగే ఆవిడ పేరిట కారు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. అలాగే సొంతూరులో రూ 5 లక్షల విలువచేసే ఇల్లు మాత్రమే ఉన్నట్లు గురుమూర్తి ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. గురుమూర్తి వద్ద ఎటువంటి ఆస్తిపాస్తులు లేకున్నా, పార్టీకి విధేయుడుగా ఉండడం, పాదయాత్రలో జగన్ వెంట నిలవడంతో ఆయన ఎంపీగా గెలిచేలా చేశాయని పలువురు రాజకీయ నాయకులు చెబుతున్నారు.