Begin typing your search above and press return to search.

అదానీ గ్రూప్ తప్పు చేస్తే దేశం భరించాలా .. హిండెన్ బర్గ్..!

By:  Tupaki Desk   |   30 Jan 2023 3:02 PM GMT
అదానీ గ్రూప్ తప్పు చేస్తే దేశం భరించాలా .. హిండెన్ బర్గ్..!
X
అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల అదానీ గ్రూపు కంపెనీల ఆస్తులన్నీ పేక మేడలని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు అత్యధిక ధరలు పలికిన ఆ కంపెనీ షేర్లు హిండెన్ బర్గ్ ప్రకటనతో ఒక్కసారిగా పతనం అవుతూ వచ్చాయి. గత వారం రోజులుగా కంపెనీ షేర్లు నష్టాలను చవి చూస్తుండటంతో అదానీకి చెందిన వేల కోట్ల సంపద ఆవిరైపోయింది.

అయితే అదానీ వ్యాపారాలకు మూల కేంద్రమైన అదానీ ఎంటర్ ప్రైజెస్ తాజాగా ఎఫ్పీవోకు వచ్చింది. సుమారు 20 వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా జనవరి 27 నుంచి ఎఫ్పీవోకు రాగా మంగళవారంతో ఈ ఇష్యూ ముగియనుంది. కాగా తొలి రోజు కేవలం ఒక శాతం మాత్రమే బుక్ అయినట్లు ప్రచారం జరుగుతుండటం ఆ కంపెనీకి మైనస్ గా మారింది.

దీంతో అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా ఎదురుదాడికి దిగింది. తాము వెల్లడించిన విషయాలు తప్పయితే తమపై దావా వేయాలని హిండెన్ బర్గ్ సవాల్ చేసినట్లు సమాచారం. దీంతో గత మూడు నాలుగు రోజులుగా పైపై వివరణలతో సరిపెట్టిన అదానీ గ్రూప్ తాజాగా ఆరు పేజీల లేఖను విడుదల చేసి ఎదురుదాడికి దిగడం ఆసక్తిని రేపుతోంది.

ఈ లేఖ సారంశం ఏమిటంటే హిండెన్ బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడి అని చెప్పడమే. ఈ సంస్థ ఓ పద్ధతి ప్రకారంగా లెక్క చూసుకుని మరీ దాడి చేస్తుందని అదానీ సంస్థ ఆరోపించింది. ఇండియా వ్యవస్థల్ని తక్కువ చేయడంతోపాటు భారత్ వృద్ధిని తగ్గించడం లక్ష్యంగా ఈ దాడి జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్ విడుదల చేసిన లేఖపై స్పందించింది.

అమెరికాలో ఎన్నో కంపెనీలు తప్పుడు విధానాలకు పాల్పడి మూతపడ్డాయని పేర్కొంది. అలాంటి కంపెనీల జాబితాను సైతం హిండెన్ బర్గ్ వెల్లడించినట్లు గుర్తుచేసింది ఆయా కంపెనీలు ఎన్నడూ అమెరికాపై జరిగిన దాడిగా పేర్కొనలేదని అదానీ గ్రూప్ మాత్రం భారత్ పై జరిగిన దాడిగా అభివర్ణించడం ఏంటని ప్రశ్నించింది.

భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని.. భవిష్యత్తులో అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేసింది. అయితే జాతీయవాదం ముసుగులో దేశాన్ని దోచుకుంటున్న అదానీ గ్రూప్ దేశ భవిష్యత్ కు అడ్డంకిగా మారుతుందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. జాతీయ వాదం పేరు చెప్పి.. అస్పష్టమైన సమాధానాలతో మోసాన్ని దాచి ఉంచలేరని స్పష్టం చేసింది.

మీరు చేసే తప్పులకు దేశం ఎలా బాధ్యత వహిస్తుందో చెప్పాలని.. మీ వ్యక్తిగత కంపెనీ డొల్లతనానికి.. దేశానికి లింకేంటి? అంటూ ఎదురుదాడికి దిగింది. ఇప్పటికీ తమ నివేదికలకు కట్టుబడి ఉన్నామని హిండెన్ బర్గ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్ మధ్య మాటల యుద్ధం ఓ రేంజులో నడుస్తోంది.

దీంతో హిండెన్ బర్గ్ గురించి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. దీనిని 2017లో నాథన్ అండర్సన్ స్థాపించారు. న్యూయార్క్ కేంద్రంగా హిండెన్ బర్గ్ పని చేస్తుంది. సంస్థల్లో పెట్టుబడులు.. రుణాలు.. డెరివేటివ్ లను విశ్లేషిస్తుంది. ఈ సంస్థ ఏదైనా కంపెనీపై గురిపెడితే వాటిలో జరుగుతున్న అవకతవకలను.. రహస్య కార్యకలాపాలు విశ్లేషించి అక్రమాలను బయటపెడుతుందనే పేరుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.