ముఖ్యమంత్రి రాజీనామా.. కొత్త సీఎం ఆయనే!

Sun May 09 2021 18:00:02 GMT+0530 (IST)

Himanta Biswa New CM of Assam

అస్సాం బీజేపీలో ముఖ్యమంత్రి పంచాయితీ ఓ కొలిక్కి వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ రాజీనామా చేసినట్టు సమాచారం. ఆయన స్థానంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కీలక నేత హిమంత్ బిశ్వ సీఎం పీఠంపై కూర్చోవడం దాదాపుగా ఖరారైపోయిందని తెలుస్తోంది.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత ఆదివారమే విడుదలైన సంగతి తెలిసిందే. నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రమాణం కూడా చేసేశారు. కానీ.. అసోం ముఖ్యమంత్రి మాత్రం ఇంకా ప్రమాణం చేయలేదు. ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి పడడమే ఇందుకు కారణం.

సిట్టింగ్ సీఎం శర్వానంద్ సోనోవాల్ మరోసారి తానే ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తుండగా.. మరో నేత హిమంత్ బిశ్వ సైతం సీఎం కుర్చీకోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఈయన.. అప్పుడే సీఎం కుర్చీకోసం ప్రయత్నించారు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి సిద్ధంగా లేరు బిశ్వ.

తనకు 40 మంది ఎమ్మెల్యేల బలం ఉందని మిత్ర పక్షాల మద్దతు కూడా తనకు ఉందని బిశ్వ అంటున్నారు. తాను ముఖ్యమంత్రిగా సాగించిన పాలన మెచ్చారు కాబట్టే.. మళ్లీ గెలిపించారని కాబట్టి తనకే సీటు ఇవ్వాలని పట్టుబట్టారు సోనోవాల్. దీంతో.. సమస్య మరింత జఠిలంగా మారేట్టుందని గుర్తించిన అధిష్టానం.. ఇద్దరినీ ఢిల్లీకి పిలిచింది.

శనివారం ఢిల్లీలో జేపీ నడ్డా హోమంత్రి అమిత్ షా తదితరులు వీరితో సమాశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రిని తేల్చేసినట్టు సమాచారం. అన్ని కోణాలను పరిశీలించిన అధిష్టానం.. ప్రస్తుత సీఎం సోనోవాల్ ను పక్కనబెట్టి.. హిమంత్ బిశ్వకు పగ్గాలు అప్పజెప్పిందని తెలుస్తోంది. ఈ విషయమై మరికాసేపట్లో అధికారిక ప్రకటన రాబోతోంది.