వేలానికి ఓకే.. కండీషన్లు పెట్టిన ఏపీ హైకోర్టు

Fri May 29 2020 09:45:11 GMT+0530 (IST)

HighCourt Conditions To Ap Government

ఏపీలోని విశాఖ.. గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది చోట్ల భూముల వేలానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించేందుకు ఓకే చెప్పింది ఏపీ హైకోర్టు. దీనికి సంబంధించిన మధ్యంతర ఉత్తర్వుల్ని తాజాగా జారీ చేసింది. అయితే.. ఎట్టి పరిస్థితుల్లో టెండర్లను ఖరారు చేయొద్దన్న హైకోర్టు.. ఇదే అంశంపై తదుపరి విచారణను జూన్ 18కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. జూన్ 11న వేలం వేసేందుకు వీలుగా ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం అయోమయానికి దారి తీస్తోంది.విశాఖ.. గుంటూరు జిల్లాల్లోని భూముల్ని 2012లో తీసుకొచ్చిన భూకేటాయింపు విధానం మేరకు అమ్ముకోవటానికి వీలుగా ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీన్ని తప్పు పడుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. 2012లో పేర్కొన్న దాని ప్రకారం.. ఈ భూముల్ని అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదన్నది పిటిషనర్ల వాదన. ప్రజావసరాల కోసం వినియోగించే ఈ భూముల్ని అమ్మకూడదని వారు చెబుతుంటే.. అందుకు భిన్నమైన వాదనను అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వినిపిస్తున్నారు.

భూముల్ని జూన్ 11న అమ్మనున్నట్లు చెప్పిన ఆయన.. ఖాళీగా ఉన్న భూముల్ని అమ్మే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనల్ని విన్న ఏపీ హైకోర్టు ప్రస్తుతానికి వేలం ప్రక్రియకు ఓకే చెప్పినా.. టెండర్ల ప్రక్రియకు మాత్రం అంగీకారాన్ని తెలపలేదు. ఈ అంశంపై మరింత అధ్యయనం చేయాలన్న కోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేశారు. మరి.. విచారణకు ముందే వేలానికి సిద్ధమవుతున్నట్లుగా మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి దీనికి కోర్టు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.