Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు హైకోర్టు.. బిగ్ షాక్‌.. క‌రోనా స‌మ‌యంలో క‌మిటీ లేంట‌ని ప్ర‌శ్న‌..!

By:  Tupaki Desk   |   9 May 2021 8:30 AM GMT
కేసీఆర్‌కు హైకోర్టు.. బిగ్ షాక్‌.. క‌రోనా స‌మ‌యంలో క‌మిటీ లేంట‌ని ప్ర‌శ్న‌..!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ``రాష్ట్రంలో క‌రోనా తీవ్రత ఎక్కువ‌గా ఉండి.. రోజుకు ప‌దుల సంఖ్యలో క‌రోనా బాధితులు మృతి చెంది... రాష్ట్ర శ‌వాల కొట్టంగా మారిపోతుంటే.. మీరు ఏం చేస్తున్నారు ? అన‌వ‌స‌ర కార్య‌క్ర‌మాలు పెట్టుకుని.. కాల‌హ‌ర‌ణం చేస్తున్నారా? `` అంటూ.. మండి ప‌డింది. ప్ర‌స్తుతం మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేంద్రంగా.. కేసీఆర్ ప్ర‌భుత్వం కేసుల‌ను తొవ్వితీస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే దేవ‌ర‌యాంజ‌ల్ భూముల అక్ర‌మాల‌పై నిగ్గు తేల్చాలంటూ..ఏకంగా న‌లుగురు ఐఏఎస్‌ల‌తో కూడిన క‌మిటీని నియ‌మించింది. దీనిని హైకోర్టు త‌ప్పుబ‌ట్టింది. ఈ దూకుడు.. క‌రోనా మీద, క‌రోనా భారిన ప‌డి.. బాధితులుగా మారుతున్న వారిని ర‌క్షించే విష‌యంపైనా దృష్టి పెట్టాల‌ని.. ఘాటుగా వ్యాఖ్యానించింది.

‘‘కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ దేవరయాంజాల్‌ ఆలయ భూముల సర్వేకు కమిటీ వేస్తూ జీవో ఎందుకు? శుక్రవారం మా పొరుగింట్లో ఒకరు మృతి చెందారు? దహన సంస్కారాలకు శ్మశానాల్లో శవాలు బారులు తీరుతున్నాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ జోక్యం చేసుకున్న తర్వాత రాత్రి 9 గంటలకు స్లాటు దొరికింది. పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతుంటే.. భూముల సర్వేకు ఇప్పుడు కమిటీ ఎందుకు? అన్నీ దొడ్డిదారిలో కానిచ్చేస్తాం అంటే ఎలా? అత్యవసరంగా ఈ జీవో జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ జీవోను ఏ చట్ట పరిధిలో జారీ చేశారు?’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది.

సెకండ్‌వేవ్‌ విరుచుకుపడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే నలుగురు ఐఏఎస్‌ అధికారులతో ఇప్పుడు కమిటీ ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. దేవరయాంజాల్‌ భూములపై 1996 నుంచే వివాదం నెలకొని ఉందని, అనేక పిటిషన్లు కోర్టుముందు ఉన్నాయని, ఇప్పుడు తక్షణమే విచారణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. ‘‘ఒక్క శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూములపైనే ఎందుకు!? అనేక ఆలయాల భూములు కబ్జాకు గురయ్యాయి. గచ్చిబౌలిలోని శ్రీరంగనాథస్వామి ఆలయ భూముల్లో ఓ బిల్డర్‌ 20 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేసి నిర్మాణాలు చేపట్టారు. దాన్ని ఎందుకు పట్టించుకోరు ? ’’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు.

దేవరయాంజాల్‌ గ్రామ పరిధిలోని తమ భూముల్లో అధికారులు చొరబడి సర్వే చేయడాన్ని ప్రశ్నిస్తూ సదా సత్యనారాయణరెడ్డి, మరో నలుగురు రైతులు హౌస్‌మోషన్‌లో దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు శనివారం ఉదయం విచారించింది. ఆలయ భూముల వ్యవహారంలో సర్కారుకు అక్షింతలు వేసింది. పిటిషనర్లను ఆక్రమణదారులుగా పేర్కొనడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. ఇవి ఆలయ భూములని రుజువు చేసేవరకు పిటిషనర్లను ఆక్రమణదారులుగా పేర్కొనడం సరికాదని స్పష్టంచేశారు.

2004లో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ జారీచేసిన ఎవిక్షన్‌ నోటీసులు, ఆ తర్వాత ట్రైబ్యునల్‌ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టును కొట్టివేసిందని పిటిష‌న‌ర్ల త‌ర‌ఫున న్యాయ‌వాది తెలిపారు. ఈ భూములు హెచ్ఎండీఏ పరిధిలోకి రాకమునుపు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేవని, అప్పటి గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్న మీదటే నిర్మాణాలు చేసినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ల భూముల జోలికి పోరాదని స్పష్టం చేశారు. జీవోపై ప్రభుత్వానికి, ఆలయ స్పెషల్‌ ఆఫీసర్‌కు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.