Begin typing your search above and press return to search.

మహిళా మంత్రికి షాక్ : ప్రజావ్యాజ్యాన్ని స్వీకరించిన హైకోర్టు

By:  Tupaki Desk   |   6 July 2022 11:53 AM GMT
మహిళా మంత్రికి షాక్ : ప్రజావ్యాజ్యాన్ని స్వీకరించిన హైకోర్టు
X
ఆమె మలి విడత విస్తరణలో మంత్రి పదవిని పొందారు. ఆమె మంత్రి కాక ముందు తన సొంత నియోజకవర్గం కళ్యాణ దుర్గంలో కంటే బెంగుళూర్ లోనే ఎక్కువగా ఉంటారన్న ఆరోపణలు నాడే వినిపించాయి. ఆయన ఆమెను గుర్తించి జగన్ మంత్రిని చేశారు.

అలా మంత్రిగా కళ్యాణ దుర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ప్రమాణం చేసి ఇప్పటికి మూడు నెలలు కావస్తోంది. శాఖాపరంగా ఆమె ఏం చేశారు అన్న ప్రశ్నలు ఒక వైపు ఉన్నాయి. అదే టైమ్ లో ఆమె మీద అతి పెద్ద భూకబ్జా ఆరోపణలు చేస్తూ కళ్యాణ దుర్గం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి ఉమామహేశ్వరనాయుడు ప్రజావ్యాజ్యం తాజాగా హైకోర్టులో దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి రెండు వారాలు గడువు విధించింది. విషయానికి వస్తే కళ్యాణదుర్గం సమీపంలో వందెకరాలు ఉన్న చెరువుని మంత్రి అనుచరులు ఆక్రమించుకుంటున్నారని ఆ పిటిషన్ లో టీడీపీ నేత ఆరోపించారు. దాని విలువ సుమారు రెండు వందల కోట్ల రూపాయలుగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ చెరువుని కనుక పూడ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెడితే ఈ ప్రాంతం అంతా మునిగిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి అనుచరుల మీద ఇప్పటికే రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజావ్యాజ్యం వేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ పిల్ విచారణకు హై కోర్టు స్వీకరించడంతో మహిళా మంత్రికి షాక్ తగిలినట్లు అయిందని అంటున్నారు. ఇక కల్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని సర్వే నంబర్ 329లో వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సుబేదార్ చెరువును లేకుండా చేయాలని మంత్రి ఆమె అనుచర వర్గం ప్రయత్నం చేస్తోంది అంటున్నారు. దాంతో ఏకంగా లారీలతో తెచ్చిన మట్టిని అక్కడికి తరలించి చెరువునే కప్పేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఇది గట్టి ఆరోపణగానే చూడాలి. చెరువులను లేకుండా చేస్తే ముంపునకు సమీప ప్రాంతాలు గురి అవుతాయి. అదే విధంగా నీటికి కటకటలాడే పరిస్థితి.

పర్యావరణవేత్తలు చెరువుల ఆవశ్యకతను గురించి చెబుతూ ఉంటే ఇలా ఏకంగా ఉన్న వాటినే కబ్జా చేయాలని చూడడం, అధికారంలో ఉన్న ఒక మహిళా మంత్రి పేరు ఇందులోకి రావడంతో రాజకీయంగా ఇది సంచలనంగా మారింది. మరి ఈ విషయంలో కోర్టు విచారణ సందర్భంగా రెవిన్యూ అధికారులు ఏం జవాబు చెబుతారో చూడాలి. రాజకీయంగా చూస్తే ఇది అతి పెద్ద చర్చకు తావిస్తోంది.