Begin typing your search above and press return to search.

ఆ మంత్రి గారి సీటు సిరిగేనా.. ?

By:  Tupaki Desk   |   3 Dec 2021 7:10 AM GMT
ఆ మంత్రి గారి సీటు సిరిగేనా.. ?
X
వైసీపీలో సీట్ల గోల ఎక్కువైపోతోంది. ఉత్తరాంధ్రా ఆవల చివరాఖరున ఉన్న జిల్లా శ్రీకాకుళం. ఈ జిల్లాకు చెందిన రెండవ మంత్రి డాక్టర్ సీదరి అప్పలరాజు. ఆయన ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యారు. గట్టిగా చెప్పాలంటే 2017 వరకూ ఆయన అసలు రాజకీయాల్లోనే లేరు. జగన్ పాదయాత్రలో ఆయనతో కలసి అడుగులు వేసిన అప్పలరాజు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. డాక్టర్ గా పలాసాలో మంచి పేరు ఉండడం వల్ల జగన్ ఆయన్ని మెచ్చి మరీ టికెట్ ఇచ్చేశారు. దాంతో మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా నెగ్గేశారు. అది కూడా బీసీలకు దేవుడుగా అంతా భావించే సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష మీద గెలవడం ద్వారా అందరి దృష్టిలో పడ్డారు.

ఇక ఒక ఏడాది గడచిందో లేదో సీదరి ఏకంగా మంత్రి అయిపోయారు. ఉత్తరాంధ్రాలో మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు. ఆ సామాజికవర్గానికి ఇప్పటిదాకా మంత్రి పదవి దక్కలేదు. జగన్ అన్ని సమీకరణలు చూసుకుని మరీ సీదరి నెత్తిన కిరీటం పెట్టేశారు. మంత్రి అయిన తరువాత సీదరి దూకుడు పెంచేశారు. దాని వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరిగుతోందని అంతా అంటున్నారు. ఆయన జిల్లాలోని వైసీపీ నేతలను కూడా కలుపుకోకుండా తనకు తోచిన రీతిన ముందుకు సాగుతున్నారని అన్న విమర్శలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే పలు వివాదాల్లో కూడా ఆయన తెలుసో తెలియకో ఇరుక్కుంటుంటున్నారు. పలాసాలో గౌతు ఫ్యామిలీ ని ఢీ కొట్టే యత్నంలో శిరీష మీద వైసీపీ కి చెందిన వారు కొందరు అనుచితమైన పోస్టింగ్స్ పెట్టారని ఆ మధ్య టీడీపీ నేతలు రచ్చ చేశారు. ఆ సంఘటనతో పలాసాలో ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. మహిళల మీద ఇలాగేనా చేస్తారు అంటూ గౌతు శిరీష మీడియా ముఖంగా మంత్రి మీద ఆయన అనుచరుల మీద నిప్పులు చెరిగారు. ఈ రోజుకీ ఆమె మంత్రిని టార్గెట్ చేసి పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఇక ఆ మధ్యన పలాసా పార్కు నుంచి గౌతు లచ్చన్న విగ్రహాన్ని అభివృద్ధి పేరిట తరలించాలని చూస్తే అది కూడా పెద్ద రచ్చగా మారింది. బీసీలంతా టీడీపీ వైపు మద్దతుగా నిలిచారు. దాంతో ఆ డెసిషన్ ని వైసీపీ పెద్దలు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇక లేటెస్ట్ గా మంత్రి గారు వీయార్వో ల మీద చేసిన కొన్ని కామెంట్స్ తో ఆ వర్గం మండిపోతోంది. దాన్ని కూడా తెలుగుదేశం రాజకీయంగా వాడుకుంటోంది. ఆత్మగౌరవం ఉంటే వీయార్వోలు విధులకు హాజరు కాకూడదని శిరీష పిలుపు ఇచ్చారు.

ఇక మంత్రిగా ఎమ్మెల్యేగా తక్కువ రాజకీయ అనుభవం ఉండడంతో సీదరి అనుకున్న విధంగా అడుగులు వేయలేక తడబడుతున్నారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్ద నాయకులు కూడా ఆయనకు సహకారం అందించడంలేదని చెబుతున్నారు. ఇక సీదరి అతి ఉత్సాహంతో చేస్తున్న కొన్ని కామెంట్స్ కూడా పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయని అంటున్నారు. మొత్తానికి మంత్రి వర్గ విస్తరణ జరిగితే సీదరి పదవికి ఎసరు తప్పదని పార్టీలో చర్చ అయితే ఉంది. మరి మాజీ మంత్రిగా సీదరి పలాసాలో వచ్చే ఎన్నికల్లో గౌతు ఫ్యామిలీని ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే. ఏది ఏమైనా గౌతు శిరీష అక్కడ మెల్లగా పట్టు బిగించేశారు అన్న మాట అయితే ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గట్టిగా నిలబడకపోతే మాత్రం ఈ సీటు టీడీపీదే అని రాసేసుకోవచ్చు అంటున్నారు అంతా.