Begin typing your search above and press return to search.

సంగం డెయిరీ టేకోవర్‌ ను కొట్టేసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   7 May 2021 8:37 AM GMT
సంగం డెయిరీ టేకోవర్‌ ను కొట్టేసిన హైకోర్టు
X
సంగం డెయిరీ సంస్థలో అక్రమాలకు పాల్పడ్డారని అరెస్ట్ అయిన గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర, ఇతర డైరెక్టర్లకు హైకోర్టులో ఊరట కలిగింది.సంగం డెయిరీని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీల్లేదని.. ఈ మేరకు జగన్ సర్కార్ జారీ చేసిన జీవోను శుక్రవారం కోర్టు కొట్టివేసింది.

సంగం డెయిరీని స్వాధీనం చేసుకుని ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిడిడిసి) కు అప్పగించాలని కోరుతూ ఏప్రిల్ 27 నాటి ప్రభుత్వ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. చివరకు లాభదాయకమైన పాల విభాగాన్ని గుజరాత్‌కు చెందిన అముల్‌కు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోందని, రాష్ట్రంలో పాడి వ్యాపారం అమ్మేసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని టిడిపి నాయకులు ఆరోపించారు.

సంగం డెయిరీని స్వాధీనం చేసుకున్నట్టు జగన్ ప్రభుత్వం జారీ చేసిన జిఓను హైకోర్టు శుక్రవారం తన తీర్పులో నిలిపివేసింది. జీవోకి చట్టపరమైన స్థితి లేదని ఆరోపించింది. ప్రస్తుత డైరెక్టర్ల బోర్డు ఈ ప్లాంట్‌ను రోజువారీ ప్రాతిపదికన కొనసాగించవచ్చని ఆదేశించింది.

సంస్థ ఆస్తుల అమ్మకం లేదా అదనపు ఆస్తుల కొనుగోలులో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవద్దని కోర్టు తెలిపింది. అలాంటి కార్యకలాపాలు చేపట్టవలసి వస్తే కోర్టు దృష్టికి తీసుకురావాలని పిటీషనర్లను కోరింది.

తనపై నమోదైన క్రిమినల్ కేసులను సవాల్ చేస్తూ దూళిపాళ్ల దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు కూడా హైకోర్టు విన్నది. దర్యాప్తుపై కోర్టు స్టే ఇవ్వాలని అతని న్యాయవాదులు కోరుతుండగా.. ధూళిపాళ్ల కరోనావైరస్ కోసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున దర్యాప్తు పూర్తి కాలేదని ఎసిబి అధికారులు చెప్పారు. హైకోర్టు ఈ కేసును తదుపరి విచారణ కోసం జూన్ 17 కి పోస్ట్ చేసింది.

సంగం డెయిరీకి సంబంధించి అవినీతి, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ధూళిపాళ్లను ఏప్రిల్ 23 న అరెస్టు చేశారు. డెయిరీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగించారు.