Begin typing your search above and press return to search.

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ .. ఆ 16 పిటిషన్లు కొట్టివేత !

By:  Tupaki Desk   |   26 Feb 2021 11:09 AM GMT
మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ .. ఆ 16 పిటిషన్లు కొట్టివేత !
X
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత వీడింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ ఈ సీ జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ దాఖలైన 16 పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు అన్నింటినీ కొట్టేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే మార్చి 10న ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నందున స్టే ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది.

హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. మార్చి 2లోపు నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 3న పరిశీలన జరపనున్న ఎన్నికల సంఘం.. మార్చి 3 మధ్యాహ్నం 3గంటల తర్వాత తుదిజాబితాను ప్రకటించనుంది. మార్చి 10వ తేదీన ఉదయం 8గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అవసరమైన చోట మార్చి 13న రీపోలింగ్ నిర్వహిస్తారు. 14వ తేదీ కౌంటింగ్ అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికలకు లైన్ క్లియర్ అవడంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్లు వేసినందున ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులున్నారు. పార్టీ గుర్తులతో జరగనున్న ఎన్నికలు కావడంతో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అవడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఎస్ఈసీ జిల్లాల్లో పర్యటించి కలెక్టర్లు, ఎస్పీలుతో భేటీ అవుతారు.