Begin typing your search above and press return to search.

వచ్చే శతాబ్దంలో జీవో ఇస్తారా..ప్రభుత్వం పై మరోసారి హైకోర్టు ఫైర్ !

By:  Tupaki Desk   |   10 Jun 2021 9:30 AM GMT
వచ్చే శతాబ్దంలో జీవో ఇస్తారా..ప్రభుత్వం పై మరోసారి హైకోర్టు ఫైర్ !
X
కరోనా వైరస్ ట్రీట్మెంట్ కి సంబంధించి అన్ని లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్స్‌ ను అత్యవసర మందుల జాబితాలో చేర్చాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా అంటూ ప్రశ్నించింది. ఔషధాల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని తాము ఆదేశిస్తే, నిబంధనలను పేర్కొంటూ ఎన్‌ పీపీఏ డిప్యూటీ డైరెక్టర్‌ అనాలోచితంగా నివేదిక ఇచ్చారంటూ మండిపడింది. లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్స్‌ ను వెంటనే అత్యవసర మందుల జాబితాలో చేర్చాలని ఆదేశించింది. ఈ మేరకు వచ్చే విచారణ తేదీ నాటికి ఎన్‌ పీపీఏ డైరెక్టర్‌ అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది.

కొత్తగా ధరలు నిర్ణయించేందుకు నాలుగు వారాల గడువు కావాలన్న వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ విజ్ఞప్తి , చేయగా దానిపై కోర్టు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కేసులన్నీ తగ్గిన తర్వాత జీవో జారీ చేస్తే ప్రయోజనం ఏంటని, వచ్చే శతాబ్దంలో జీవో ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రులు, కార్పొరేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ లతో చర్చించి కొత్త ధరలను నిర్ణయించి రెండు వారాల్లోగా జీవో జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ డీజీపీ సమర్పించిన నివేదిక పై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు కరోనా నియంత్రణ చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.

స్వచ్ఛంద సంస్థల సహకారంతో కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి నిరుపేదలు, రోడ్లపై జీవనం సాగించే వారికి, వలస కూలీలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను కూడా అమలు చేయలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. విపత్తు నిర్వహణ చట్టం కింద ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఏర్పాటు చేయలేదని నిలదీసింది. మూడో దశ కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్‌ కళాశాలల్లో చిన్న పిల్లల వార్డులను ఏర్పాటు చేశాం. దాదాపు 4 వేల ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో శిక్షణ పొందిన 10 వేల మంది నర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే రోజుకు 10 లక్షల మందికి ఇవ్వ గలిగే సామర్థ్యం ఉంది. జూలై రెండో వారంలో 17 లక్షల డోసుల వ్యాక్సిన్‌ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. వచ్చే మూడు నెలల్లో అందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు తీసుకున్నారంటూ 135 ఆస్పత్రులపై 223 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కొన్ని ఫిర్యాదులను విచారించి రూ.65 లక్షలు వెనక్కి ఇప్పించాం. ఇతర ఫిర్యాదులపై కూడా ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చిస్తున్నాం.