అమరావతి దళితుల ప్లాట్లపై హైకోర్టు స్టేటస్ కో!

Mon Sep 13 2021 21:44:00 GMT+0530 (IST)

High Court Status Co on Amravati Dalit plots

ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన దళిత రైతులకు కేటాయించిన ప్లాట్లను తిరిగి తీసుకునేలా.. ప్రభుత్వం జారీ చేసిన జీవో.. తదుపరి చర్యలపై హైకోర్టు యథాతథ స్థితి(స్టేటస్ కో)ని ప్రకటించింది. సోమవారం దీనిపై జరిగిన విచారణలో ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగాగతంలోనే జీవో 316 అమలుపై కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. రాజధాని కోసం ఏపీసీఆర్ డీకే కు దళిత రైతులు భూములు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. వీటికి సంబంధించి వారికి కేటాయించిన వాణిజ్య స్థలాలను వెనక్కి తీసుకునేలా ప్రస్తుత ప్రభుత్వం జీవో 316ను జారీ చేసింది.సోమవారం.. దీనిపై మరోసారి జరిగిన విచారణలో జీవో 316ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అదేసమయంలో దళిత రైతుల యాజమాన్య హక్కులపై యథాతథ స్థితిని కోర్టు ప్రకటించింది. అదేసమయంలో ఏపీ సీఆర్ డీఏ స్తానంలో వచ్చిన..అమరావతి మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ అధారిటీ(ఏఎంఆర్డీఏ) తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సోమవారం నాటి విచారణలో ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం.. వాటిని ప్లాటులుగా మార్చడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున కే. ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో అసంబద్ధమైందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకితీసుకున్న హైకోర్టు.. యథాతథ స్థితిని ప్రకటించింది.  

ఆగస్టు తొలివారంలో ప్రభుత్వం 50 మంది రైతులకు నోటీసులు జారీ చేసింది. వీరందరికీ వాణిజ్య ప్లాట్లను గత ప్రభుత్వం కేటాయించింది. వారి నుంచి రాజధాని కోసం.. ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు తీసుకున్న అప్పటి ప్రభుత్వం వీరికి వాణిజ్య స్థలాలను కేటాయించింది.  ఇక వీరితోపాటు.. ఈ భూములను తక్కువ ధరలకే కొనుగోలు చేసిన వారికి కూడా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.  వీరందరూ.. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని.. ప్రబుత్వం నోటీసుల్లో స్పష్టం చేసింది. నివాస వాణిజ్య స్థలాలను ఎందుకు వెనక్కి తీసుకోకూడదో చెప్పాలని.. సదరు నోటీసుల్లో ప్రభుత్వం కోరింది. అంతేకాదు.. వీరంతా అసైన్డ్ చట్టాల నిబంధనలను ఉల్లంఘించారని తెలిపింది.  

నిబంధనల మేరకు దళితులకు ఇచ్చిన భూములను వ్యవసాయం చేసుకునేందుకు మాత్రమే వినియోగించాలని.. వాటిని అమ్మరాదని పేర్కొంది. ఒకవేళ ఈ నిబంధన ఉల్లంఘిస్తే.. ప్రభుత్వం ఆయా భూములను వెనక్కి తీసుకునే అధికారం ఉంటుందని తెలిపింది.  ఇదిలావుంటే.. గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో భాగంగా ఇక్కడి రైతుల నుంచి సేకరించిన భూములకు సంబంధించి జీవో 41 విడుదల చేసింది. అసైన్డ్ నిబంధనలు సవరించి.. రైతులు ఆయా భూములను అమ్ముకునేలా.. ఇతరులు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది.  ఈ క్రమంలో ల్యాండ్ పూలింగ్ కింద.. ఆయా భూములను రైతులు.. ప్రభుత్వానికి ఇచ్చారు.

ఇక ఇదే సమయంలో కొందరు దళిత రైతులు.. తమ భూములను వారి వ్యక్తిగత ఆర్థిక అవసరాల నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులకు వాటిని విక్రయించారు. కొందరు ప్రభుత్వానికి ఇచ్చారు. వీరికి ప్రభుత్వం రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్లను కేటాయించింది.  అయితే.. ప్రస్తుత ప్రభుత్వం.. టీడీపీ నేతలు.. కొందరు .. దళిత రైతులను మభ్య పెట్టి బెదిరించి(ఇన్సైడర్ ట్రేడింగ్) భూములు కొనుగోలు చేశారని.. పేర్కొంటూ.. ఏసీబీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసును రాష్ట్ర హైకోర్టు సుప్రీం కోర్టు కూడా కొట్టేశాయి. అక్కడ ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని తేల్చి చెప్పాయి.